సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ ఇంట పెళ్లి సందడి ప్రారంభమైంది. ఆయన కుమార్తె జనని వివాహం త్వరలో జరగనుండగా, దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రిక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఆ పత్రికపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి పేర్లు ఉండటం చర్చనీయాంశంగా మారింది.
జనని వివాహం పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సూర్య తేజతో ఆగస్టు 16న జరగనుంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో ఉదయం 11:58 గంటలకు ముహూర్తం నిర్ణయించారు. ఇప్పటికే నిశ్చితార్థ వేడుకను నిర్వహించిన బండ్ల గణేశ్, సినీ మరియు రాజకీయ ప్రముఖులను స్వయంగా ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది.
వివాహ ఆహ్వాన కార్యక్రమంలో భాగంగా తొలి పత్రికను తిరుమల శ్రీవారి పాదాల వద్ద ఉంచి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం రెండో ఆహ్వాన పత్రికను నారా భువనేశ్వరికి అందజేశారు. అయితే కార్డుపై “శ్రీమతి నారా భువనేశ్వరి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో” అని ప్రత్యేకంగా ముద్రించడం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.
బండ్ల గణేశ్ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు వీరాభిమాని అన్న విషయం తెలిసిందే. పలు వేదికలపై పవన్ కల్యాణ్‌ను ఎంతో అభిమానంతో ప్రస్తావించే బండ్ల గణేశ్, తన కుమార్తె పెళ్లి పత్రికపై చంద్రబాబు దంపతుల పేర్లు ముద్రించడంపై కొందరు సోషల్ మీడియాలో ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
మరోవైపు నారా కుటుంబంతో బండ్ల గణేశ్‌కు చాలాకాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఆ గౌరవంతోనే వారి పేర్లను పత్రికపై ముద్రించారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు రాజకీయంగా తిరిగి ఎదగాలని కోరుతూ బండ్ల గణేశ్ గతంలో చేసిన మొక్కు, తిరుమలకు పాదయాత్ర చేసిన అంశాలను కూడా అభిమానులు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం జనని పెళ్లి పత్రిక సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు కారణమైంది.