హైదరాబాద్ పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫతే దర్వాజా ప్రాంతంలో ఓ మూడంతస్తుల భవనంలోని మూడో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు ఉవ్వెత్తున ఎగసిపడటంతో దట్టమైన పొగలు పరిసర ప్రాంతాలను కమ్మేశాయి.
అగ్నిప్రమాదాన్ని గమనించిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలు ఇతర అంతస్తులు, పక్క భవనాలకు వ్యాపించకుండా చర్యలు తీసుకుని అదుపులోకి తీసుకొచ్చారు.
ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. దీంతో స్థానికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే మంటల ధాటికి భవనంలోని సామగ్రి దగ్ధమై భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
అగ్నిప్రమాదానికి కచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి విచారణ అనంతరం ప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టంపై స్పష్టత రానుంది.
