పండుగల సీజన్ సమీపిస్తున్న వేళ చక్కెర ధరలు వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అంతర్జాతీయ, దేశీయ మార్కెట్లలో ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. న్యూయార్క్ మార్కెట్‌లో రా షుగర్ ఫ్యూచర్స్ 14 నెలల గరిష్ఠానికి చేరడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది.
న్యూయార్క్ మార్కెట్‌లో రా షుగర్ ఫ్యూచర్స్ ధర 4.3 శాతం పెరిగి పౌండ్‌కు 17.59 సెంట్లకు చేరింది. ఆగస్టు నెలలోనే అంతర్జాతీయంగా చక్కెర ధరలు సుమారు 18 శాతం పెరిగాయి. దేశీయ మార్కెట్లలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో హోల్‌సేల్ చక్కెర ధర క్వింటాల్‌కు రూ.5,350కి చేరగా, ఉత్తరప్రదేశ్‌లో రూ.5,400, ఢిల్లీలో రూ.5,800 వద్ద ట్రేడవుతోంది. ముంబై రిటైల్ మార్కెట్‌లో కిలో చక్కెర ధర రూ.59కి చేరింది. గత నెలతో పోలిస్తే కిలోకు దాదాపు రూ.10 వరకు ధర పెరిగింది.
సరఫరా కొరతే ప్రధాన కారణం
ప్రపంచవ్యాప్తంగా చక్కెర సరఫరా తగ్గడం ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. బ్రెజిల్‌లో చెరకును ఇథనాల్ ఉత్పత్తికి ఎక్కువగా మళ్లించడం, ఎల్‌నినో ప్రభావంతో పంట దిగుబడులు తగ్గడం వంటి అంశాలు అంతర్జాతీయ మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. భారత్‌లోనూ చక్కెర ఉత్పత్తి అంచనాల కంటే తక్కువగా నమోదవుతుండటం ధరలపై ఒత్తిడిని పెంచుతోంది.
మరోవైపు గణేశ్ చతుర్థి, దసరా, దీపావళి వంటి పండుగలు వరుసగా రానుండటంతో చక్కెరకు డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో రానున్న రోజుల్లో ధరలు ఎలా మారుతాయన్నది వినియోగదారుల్లో ఆసక్తిని పెంచుతోంది.
ధరల నియంత్రణకు కేంద్రం చర్యలు?
పెరుగుతున్న ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. దాదాపు దశాబ్దం తర్వాత చక్కెర దిగుమతులకు అనుమతి ఇవ్వడం, దిగుమతి సుంకాన్ని తగ్గించడం లేదా పూర్తిగా తొలగించడం వంటి ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే చక్కెర నిల్వలపై పరిమితులు విధించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై దేశీయ చక్కెర మార్కెట్ భవిష్యత్తు ఆధారపడి ఉండనుంది.
