హైదరాబాద్: ఒకే హిందూ పండుగకు రెండు వేర్వేరు తేదీలు.. ఏ రోజున పండుగ జరుపుకోవాలన్న సందిగ్ధత.. ఆలయాలు, అర్చకులు, భక్తుల్లో అయోమయం.. ఇలాంటి పరిస్థితులకు ముగింపు పలికే దిశగా తెలంగాణ జ్యోతిష్య విజ్ఞాన సభలో కీలక నిర్ణయం తీసుకున్నారు. 2027-28, 2028-29 సంవత్సరాలకు సంబంధించిన పండుగల తేదీలపై తెలుగు రాష్ట్రాల దృక్ సిద్ధాంత పంచాంగ కర్తలు చర్చించి ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.
ఆగస్టు 6న హైదరాబాద్ బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్‌లో తెలంగాణ అర్చక సమాఖ్య, భాగ్యనగర అర్చక పురోహిత సంఘం, భారతీయ తెలుగు దృగ్గణిత పంచాంగ కర్తల సమాఖ్య సేవా సంఘం, శ్రీ చండీ పరమేశ్వరి పీఠం సంయుక్త ఆధ్వర్యంలో ఈ సభ జరిగింది.
పండుగల తేదీలపై ఎందుకీ చర్చ?
గత కొన్నేళ్లుగా కొన్ని పండుగలకు సంబంధించి వేర్వేరు తేదీలు ప్రకటించడంతో ప్రజల్లో గందరగోళం నెలకొంటోందని సభలో పండితులు పేర్కొన్నారు. భక్తులు ఏ రోజున పూజలు చేయాలి? ఆలయాల్లో ఏ రోజున ఉత్సవాలు నిర్వహించాలి? ప్రభుత్వ సెలవు ఏ తేదీన ఉండాలి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయని వివరించారు.
ఈ పరిస్థితి ఆలయాలు, అర్చకులు, ప్రభుత్వ శాఖలు, విద్యాసంస్థలపైనా ప్రభావం చూపుతోందని సభలో చర్చించారు.
రెండేళ్ల పండుగల తేదీలకు గ్రీన్ సిగ్నల్
డాక్టర్ అవసరాల ప్రసాద్ శర్మ సిద్ధాంతి అధ్యక్షతన, శ్రీ గట్టు శ్రీనివాసాచార్యుల సమన్వయంతో జరిగిన ఈ సభలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పంచాంగ కర్తలు పాల్గొన్నారు.
ప్లవంగ నామ సంవత్సరం 2027-28, కీలక నామ సంవత్సరం 2028-29కు సంబంధించిన పండుగలు, పర్వదినాల తేదీలను దృక్ సిద్ధాంతం ఆధారంగా పరిశీలించారు. శాస్త్రబద్ధమైన గణనలపై చర్చించిన అనంతరం రెండు సంవత్సరాల పండుగల నిర్ణయాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.
నేషనల్ పంచాంగం ప్రస్తావన
భారత ప్రభుత్వం 1953లో ఏర్పాటు చేసిన క్యాలెండర్ రిఫార్మ్ కమిటీ సిఫార్సుల మేరకు ప్రత్యక్ష గ్రహగతుల ఆధారంగా రాష్ట్రీయ పంచాంగం ప్రచురితమవుతోందని సభలో వివరించారు.
ప్రాంతీయ భాషల్లోనూ అందుబాటులో ఉండే ఈ పంచాంగాన్ని రాష్ట్రాల దేవాదాయ, ధర్మాదాయ శాఖలకు అధికారికంగా పంపిణీ చేస్తున్నారని తెలిపారు. తాము రూపొందించే దృక్ సిద్ధాంత పంచాంగాల్లోని పండుగల నిర్ణయాలు కూడా రాష్ట్రీయ పంచాంగంలోని నిర్ణయాలతో ఏకీభవిస్తున్నాయని పంచాంగ కర్తలు వెల్లడించారు.
తీర్మానం అందజేత
రెండు సంవత్సరాల పండుగల తేదీలతో పాటు సభలో చర్చించిన అంశాలన్నింటినీ పొందుపరుస్తూ తీర్మానం రూపొందించారు. ఈ తీర్మానాన్ని సభలోనే తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ వైస్ చైర్మన్ శ్రీ పొన్నాడ సుబ్రహ్మణ్యం, మాజీ మంత్రి శ్రీ వేణుగోపాలచారిలకు అందజేశారు.
పండుగల తేదీల విషయంలో ప్రజలకు స్పష్టత కల్పించడం, ఆలయాలు, అర్చకులు, ప్రభుత్వ శాఖలు, విద్యాసంస్థలు ఒకే విధమైన నిర్ణయాన్ని అనుసరించేలా చూడటం ఈ తీర్మానం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
పలువురు సిద్ధాంతుల పాల్గొనడం
సభలో శ్రీ గంగు ఉపేంద్ర శర్మ, పరాశర రవీంద్రాచార్యులు, డీవీఆర్ శర్మ, పెన్నా మోహన్ శర్మ, సతీష్ శర్మ, సంతోష్ శాస్త్రి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే శ్రీ గొర్తి పట్టాభి సిద్ధాంతి, పీఎస్‌ఆర్ కృష్ణ, నిట్టల కృష్ణ ప్రసాద్, సీవీ అనంత, కర్ర వీరభద్రం, బిజుమల్ల శ్రీనివాస్ సిద్ధాంతి తదితర తెలుగు రాష్ట్రాల సిద్ధాంతులు, పంచాంగ కర్తలు హాజరయ్యారు.
తెలుగు రాష్ట్రాలకు చెందిన పంచాంగ నిపుణులు ఒకే వేదికపై సమావేశమై పండుగల తేదీలపై చర్చించి ఏకగ్రీవ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నిర్ణయాల ద్వారా భవిష్యత్తులో పండుగల తేదీలపై ప్రజల్లో నెలకొనే గందరగోళం తగ్గుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
