Home తెలంగాణ సొంతింటి కల నెరవేరే ఛాన్స్.. హైదరాబాద్‌లో కొత్త ఇందిరమ్మ LIG ఇళ్లు.. దరఖాస్తు ఇలా చేసుకోండి

సొంతింటి కల నెరవేరే ఛాన్స్.. హైదరాబాద్‌లో కొత్త ఇందిరమ్మ LIG ఇళ్లు.. దరఖాస్తు ఇలా చేసుకోండి

10
0

హైదరాబాద్: సొంతింటి కోసం ఎదురుచూస్తున్న అల్పాదాయ వర్గాల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఇప్పుడు హైదరాబాద్‌లోని క్యూర్ (CURE) పరిధిలో ఎల్‌ఐజీ (LIG) హౌసింగ్ ప్రాజెక్టు రూపంలో విస్తరించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్హతలు, దరఖాస్తు విధానం వివరాలతో కూడిన అధికారిక బ్రోచర్‌ను విడుదల చేశారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. పేదలకు సొంత ఇల్లు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. మొదటి విడతలో సొంత స్థలం ఉన్న లబ్ధిదారులకు 4.5 లక్షల ఇళ్లను మంజూరు చేశామని, అందులో 2 లక్షలకు పైగా ఇళ్లు ఆగస్టు నాటికి పూర్తవుతాయని చెప్పారు. రెండో విడతలో మరో 2.5 లక్షల ఇళ్లను మంజూరు చేసినట్లు వెల్లడించారు.

సొంత స్థలం కూడా లేని నిరుపేదల కోసం ఇప్పుడు హైదరాబాద్‌లోని క్యూర్ ప్రాంతంలో అపార్ట్‌మెంట్ తరహా ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని 26 నియోజకవర్గాల్లో ఒక్కో చోట 500 ఫ్లాట్ల చొప్పున ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక్కో ఫ్లాట్ 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో, అవసరమైన అన్ని మౌలిక వసతులతో నిర్మించబడుతుందని వెల్లడించారు.

ఎవరు అర్హులు?

  • వార్షిక కుటుంబ ఆదాయం రూ.6 లక్షలలోపు ఉండాలి.
  • సొంత ఇల్లు లేదా ఇంటి స్థలం ఉండకూడదు.
  • ప్రభుత్వం నిర్దేశించిన ఇతర అర్హతలను పూర్తి చేయాలి.

లబ్ధిదారుల వాటా ఎంత?

మంత్రి వివరాల ప్రకారం, ఒక్కో ఇంటి నిర్మాణ వ్యయం రూ.11 లక్షలు. ఇందులో ప్రభుత్వం కాంట్రాక్టర్‌కు రూ.5 లక్షలు చెల్లిస్తుంది. మిగిలిన రూ.6 లక్షలను లబ్ధిదారులు నాలుగు విడతల్లో చెల్లించాల్సి ఉంటుంది.

అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. దళారులను నమ్మవద్దని, ఎవరికి ఒక్క రూపాయి కూడా చెల్లించవద్దని మంత్రి ప్రజలకు సూచించారు.

దరఖాస్తు ఎలా చేయాలి?

ఇందిరమ్మ LIG ఇళ్ల కోసం ఆగస్టు 10 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

దరఖాస్తు చేసుకునే విధానం:

  • ప్రజాపాలన కేంద్రాల నుంచి అధికారిక దరఖాస్తు ఫారమ్ తీసుకుని సమర్పించాలి.
  • లేదా మీసేవ కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • మీసేవ ద్వారా దరఖాస్తు చేసేందుకు రూ.100 ఫీజు చెల్లించాలి.

ఈ సందర్భంగా హౌసింగ్ పథకానికి పేరు సూచించే పోటీలో విజేతగా నిలిచిన నల్గొండ జిల్లాకు చెందిన కొండా నాగరాజుకు మంత్రులు రూ.1 లక్ష నగదు బహుమతి అందజేసి అభినందించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పోటీలో సుమారు 14 వేల మంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here