Home తెలంగాణ HYDRAA: రూ.1.10 లక్షల కోట్ల భూములకు రక్షణ.

HYDRAA: రూ.1.10 లక్షల కోట్ల భూములకు రక్షణ.

0

హైదరాబాద్: ప్రభుత్వ, ప్రజా అవసరాలకు సంబంధించిన భూముల ఆక్రమణలపై కఠిన చర్యలు చేపడుతున్న హైడ్రా (HYDRAA) గత రెండేళ్లలో భారీ స్థాయిలో భూములను కాపాడింది. కబ్జాదారుల చెర నుంచి విముక్తి కల్పించిన భూముల విలువ సుమారు రూ.1.10 లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నారు. మరో ఏడాదిలో అదనంగా రూ.1 లక్ష కోట్ల విలువైన భూములను రక్షించడాన్ని లక్ష్యంగా పెట్టుకుని అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు.

హైడ్రా ఏర్పాటైన తర్వాత ఇప్పటివరకు మొత్తం 2,435.23 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది. వీటిలో చెరువులు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు, నాలాలు, రహదారులు, ప్రజావసరాల కోసం కేటాయించిన భూములు ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువను పరిగణనలోకి తీసుకుంటే, ఈ భూముల విలువ భారీ స్థాయిలో ఉంటుందని అధికారులు వెల్లడిస్తున్నారు.

చెరువుల పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం

చెరువుల ఆక్రమణలను తొలగించడంలో హైడ్రా ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటివరకు 449.11 ఎకరాల చెరువు భూములను ఆక్రమణల నుంచి రక్షించింది. తొలి విడతలో చేపట్టిన చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా తమ్మిడికుంట, కూకట్‌పల్లి నల్లచెరువు, ఉప్పల్ నల్లచెరువు, సున్నం చెరువు, బమృకున్ ఉద్ దౌలా చెరువు, బతుకమ్మకుంట ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగించి చెరువుల విస్తీర్ణాన్ని పెంచింది.

మొదటి విడతలో చెరువుల పరిసర ప్రాంతాల్లో దాదాపు 70 ఎకరాల భూమిని రక్షించిన హైడ్రా, ప్రస్తుతం రెండో విడతలో ఎంపిక చేసిన 14 చెరువుల వద్ద మరో 300 ఎకరాల భూమిని కాపాడేందుకు చర్యలు చేపడుతోంది. చెరువుల పునరుద్ధరణ ద్వారా పర్యావరణ పరిరక్షణకు కూడా ప్రాధాన్యం ఇస్తోంది.

1,800 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూముల స్వాధీనం

హైడ్రా ఏర్పాటైన అనంతరం ప్రజావాణి ఫిర్యాదులు, రెవెన్యూ శాఖ అందించిన సమాచారాన్ని ఆధారంగా తీసుకుని 1,804.23 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. ముఖ్యంగా కుత్బుల్లాపూర్, అమీన్‌పూర్, ఖానామెట్, కొండాపూర్, ఘట్‌కేసర్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆక్రమణలను తొలగించి ప్రభుత్వ భూములను రక్షించింది.

భవిష్యత్తులో కూడా ఆక్రమణలపై మరింత కఠినంగా వ్యవహరిస్తూ, ప్రజా ఆస్తుల పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు హైడ్రా అధికారులు స్పష్టం చేస్తున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version