Home జాతీయం రానుంది అసలు ముప్పు! భారత్‌‌లోని నగర జనాలను భయపెడుతున్న తీవ్ర హెచ్చరిక

రానుంది అసలు ముప్పు! భారత్‌‌లోని నగర జనాలను భయపెడుతున్న తీవ్ర హెచ్చరిక

0

భారత్‌లో నీటి నిర్వహణ వ్యవస్థను వెంటనే బలోపేతం చేయకపోతే రాబోయే కాలంలో దేశం తీవ్రమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉందని ప్రముఖ గ్లోబల్ క్రెడిట్ రేటింగ్ సంస్థ మూడీస్ రేటింగ్స్ హెచ్చరించింది. వ్యవసాయం, గృహ అవసరాలు, పరిశ్రమలు, వేగంగా విస్తరిస్తున్న డిజిటల్ రంగాల మధ్య నీటి పంపిణీ సమర్థవంతంగా జరగకపోవడం ప్రధాన ఆందోళనగా పేర్కొంది.

మూడీస్ నివేదిక ప్రకారం, భారత్‌లో నీటి నిర్వహణ బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉండటంతో దేశవ్యాప్తంగా ఏకీకృత విధానం అమలు కావడం లేదు. రాష్ట్రాలవారీగా విధానాలు, ప్రాధాన్యతలు మారుతుండటంతో నీటి వనరుల సమన్వయ వినియోగం సవాలుగా మారింది.

దేశంలో అందుబాటులో ఉన్న మంచినీటిలో దాదాపు 80 శాతం వ్యవసాయ రంగానికే వినియోగమవుతోంది. రైతులకు నీరు, విద్యుత్‌పై అందిస్తున్న సబ్సిడీల కారణంగా ప్రభుత్వాలపై అదనపు ఆర్థిక భారం పడుతోంది. మరోవైపు పరిశ్రమలు, పట్టణ అవసరాలకు నీటి కేటాయింపులు పెంచే ప్రక్రియ నెమ్మదిగా సాగుతుండటంతో డిమాండ్-సరఫరా మధ్య అంతరం పెరుగుతోంది.

ఇక డిజిటల్ ఆర్థిక వ్యవస్థ విస్తరణ కూడా కొత్త సవాళ్లను తెరపైకి తీసుకొస్తోంది. డేటా సెంటర్లు, క్లౌడ్ కంప్యూటింగ్ కేంద్రాలు, కృత్రిమ మేధ (AI) ఆధారిత పరిశ్రమలకు భారీ స్థాయిలో నీటి అవసరం ఉంది. ముఖ్యంగా సర్వర్ల శీతలీకరణ కోసం పెద్ద మొత్తంలో నీటిని వినియోగించాల్సి వస్తోంది. భవిష్యత్తులో ఈ రంగం మరింత విస్తరించడంతో నీటి డిమాండ్ గణనీయంగా పెరిగే అవకాశముందని మూడీస్ అంచనా వేసింది.

వాతావరణ మార్పులు పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తున్నాయి. తరచూ సంభవిస్తున్న కరువులు, వరదలు, అస్థిర రుతుపవనాలు, మారుతున్న వర్షపాతం సరళి దేశ నీటి భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. భూగర్భ జలాల అధిక వినియోగం, పాతబడిన నీటి సరఫరా వ్యవస్థలు సమస్యను మరింత తీవ్రమం చేస్తున్నాయి.

దేశంలోని ప్రధాన నగరాలు ఇప్పటికే నీటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ముంబై జలాశయాల్లో నీటి నిల్వలు ఆందోళనకర స్థాయికి చేరుకోగా, ఢిల్లీలో అనేక ప్రాంతాలు నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నాయి. ప్రస్తుతం చెన్నై పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ, పెరుగుతున్న డిమాండ్ భవిష్యత్తులో అక్కడ కూడా సవాళ్లు సృష్టించే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.

పెరుగుతున్న జనాభా, పారిశ్రామికీకరణ, వాతావరణ మార్పుల నేపథ్యంలో సమర్థవంతమైన నీటి నిర్వహణ కేవలం పర్యావరణ పరిరక్షణకే కాకుండా దేశ ఆర్థిక స్థిరత్వానికి కూడా అత్యంత కీలకమని మూడీస్ స్పష్టం చేసింది. దీర్ఘకాలిక ప్రణాళికలు, పటిష్టమైన నీటి పాలన, వనరుల సమర్థ వినియోగం లేకపోతే భారత్ మరింత తీవ్రమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version