Home తెలంగాణ ఇందిరమ్మ ఇళ్ల పథకంపై విమర్శలు.. ప్రీలాంచ్‌ రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులా మార్చేశారంటూ ఆరోపణలు

ఇందిరమ్మ ఇళ్ల పథకంపై విమర్శలు.. ప్రీలాంచ్‌ రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులా మార్చేశారంటూ ఆరోపణలు

0

గ్రేటర్‌ హైదరాబాద్‌లో లక్ష ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తామని ప్రకటించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. పేదల సొంతింటి కలను సాకారం చేసే పథకాన్ని రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులా మార్చిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల సమయంలో ఇళ్లు లేని నిరుపేదలకు ఉచితంగా ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు ముందుగా డబ్బులు చెల్లిస్తే ఇళ్లు ఇస్తామంటూ నిబంధనలు విధించడం చర్చనీయాంశంగా మారింది.

ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకునే వారు ముందుగా రూ.10 వేల టోకెన్‌ అమౌంట్‌ చెల్లించాలంటూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేయడం కూడా విమర్శలకు దారితీస్తోంది. అంతేకాకుండా దశలవారీగా మొత్తం రూ.6 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొనడం.. రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు చేపట్టే ప్రీలాంచ్‌ ప్రాజెక్టులను తలపిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి.

సాధారణంగా పేదల కోసం ప్రభుత్వం నిర్మించే ఇళ్లకు మార్కెటింగ్‌, ప్రకటనలు, అడ్వాన్స్‌ బుకింగ్స్‌, అమ్మకాలు లేదా లబ్ధిదారుల నుంచి ఆర్థిక లావాదేవీలు ఉండకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి లావాదేవీలు జరిగితే ఆ ప్రాజెక్టు వాణిజ్య రియల్‌ ఎస్టేట్‌ పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.

గతంలో పేదలకు పంపిణీ చేసిన ఇళ్లు లేదా భవన సముదాయాలు శిథిలావస్థకు చేరిన సందర్భాల్లో వాటి స్థానంలో కొత్త నిర్మాణాలు చేపట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే, అలాంటి ఇళ్ల విషయంలోనూ లబ్ధిదారులతో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరపకూడదని పేర్కొంటున్నారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకంలో టోకెన్‌ అమౌంట్‌ వసూలు చేయడం, దశలవారీగా రూ.6 లక్షలు చెల్లించాలనే నిబంధనలు విధించడం రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) నిబంధనలకు విరుద్ధంగా ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో పేదల కోసం ఉద్దేశించిన ఇందిరమ్మ ఇళ్ల పథకంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version