ప్రముఖ లడఖీ విద్యావేత్త, పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి నుంచి గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రికి తరలించారు. గత 24 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు.. ఆయన కోరుకున్న ఆసుపత్రికి తరలించాలని మంగళవారం సాయంత్రం ఆదేశించింది.
ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వాంగ్‌చుక్‌కు నిరంతర వైద్య పర్యవేక్షణ అవసరమని ఎయిమ్స్, సఫ్దర్‌జంగ్ ఆసుపత్రుల వైద్యులతో పాటు ఆయన వ్యక్తిగత వైద్యులు కూడా సూచించడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. మెరుగైన చికిత్స కోసం మేదాంత ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి విడుదల చేసిన వైద్య బులెటిన్ ప్రకారం.. వాంగ్‌చుక్ కీలక ఆరోగ్య ప్రమాణాలు ప్రస్తుతం స్థిరంగా ఉన్నాయి. అయితే, పోషకాహార లోపం కారణంగా పాన్‌సైటోపెనియా (రక్తంలోని వివిధ కణాల సంఖ్య తగ్గడం), సీరమ్ పొటాషియం స్థాయిలు తగ్గినట్లు వైద్యులు గుర్తించారు. తదుపరి చికిత్స కోసం ఆయనకు సంబంధించిన అన్ని వైద్య రికార్డులను మేదాంత ఆసుపత్రికి అందజేశారు.
మరోవైపు, ఆసుపత్రి మారినప్పటికీ తన నిరాహార దీక్షను కొనసాగిస్తానని వాంగ్‌చుక్ స్పష్టం చేసినట్లు ఆయన భార్య గీతాంజలి జె. ఆంగ్మో తెలిపారు. ‘సంసద్ చలో’ యాత్ర సందర్భంగా విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జ్‌కు నిరసనగా, వారికి సంఘీభావంగా ఆయన దీక్ష కొనసాగిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.
విద్యా సంస్కరణలు, నీట్ వంటి పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలపై పార్లమెంటులో చర్చించాలని డిమాండ్ చేస్తూ వాంగ్‌చుక్ జూన్ చివరి నుంచి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.
