మేడ్చల్ పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతూ వాణిజ్య, వ్యాపార రంగాలకు ప్రధాన కేంద్రంగా రూపుదిద్దుకుంటోందని మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. అంతర్జాతీయ, జాతీయ స్థాయి ప్రముఖ బ్రాండ్లు మేడ్చల్‌లో తమ వ్యాపారాలను విస్తరించడం ఈ ప్రాంత అభివృద్ధికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ పరిధిలోని మేడ్చల్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ ‘OWND’ షోరూమ్‌ను శుక్రవారం ఎమ్మెల్యే మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూమ్‌ను పరిశీలించిన ఆయన, అక్కడ అందుబాటులో ఉన్న ఆధునిక ఫ్యాషన్ కలెక్షన్లను సందర్శించి యాజమాన్యాన్ని అభినందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మేడ్చల్ నియోజకవర్గం పరిశ్రమలు, విద్య, రవాణా, వాణిజ్య రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. కొత్తగా ఏర్పడుతున్న షోరూమ్‌లు, వ్యాపార సంస్థల ద్వారా స్థానిక యువతకు ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. ప్రజలు నాణ్యమైన, బ్రాండెడ్ వస్త్రాల కోసం నగరంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మేడ్చల్‌లోనే అత్యాధునిక ఫ్యాషన్ ఉత్పత్తులు అందుబాటులోకి రావడం సంతోషకరమైన విషయమన్నారు.
మారుతున్న ఫ్యాషన్ ట్రెండ్‌కు అనుగుణంగా అన్ని వయసుల వారికి ఒకే చోట నాణ్యమైన దుస్తులు, విభిన్న డిజైన్లు, ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావడం వినియోగదారులకు ఎంతో ప్రయోజనకరమని మల్లారెడ్డి పేర్కొన్నారు. స్థానిక వినియోగదారులకు ఉత్తమ సేవలు అందిస్తూ ఈ షోరూమ్ విజయవంతంగా కొనసాగాలని, మరిన్ని శాఖలను కూడా ఏర్పాటు చేయాలని యాజమాన్యానికి ఆకాంక్షించారు.
షోరూమ్ ప్రారంభోత్సవం సందర్భంగా యాజమాన్యం ప్రత్యేక ప్రారంభ ఆఫర్లు, రాయితీలను ప్రకటించింది. దీంతో పెద్ద సంఖ్యలో వినియోగదారులు షోరూమ్‌ను సందర్శించి కొనుగోళ్లకు ఆసక్తి చూపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, షోరూమ్ యాజమాన్య ప్రతినిధులు, పట్టణ ప్రముఖులు, స్థానిక యువత, వినియోగదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.