లెనిన్’ సినిమా విజయంతో ఉత్సాహంగా ఉన్న అన్నపూర్ణ స్టూడియోస్ మరో కొత్త ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించింది. ఎపిక్ స్టూడియోస్తో కలిసి నిర్మిస్తున్న ‘పళ్ళ బురుసు’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సినిమా 2026 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. జిల్లా కోర్టు ప్రాంగణాన్ని బ్యాక్‌డ్రాప్‌గా చూపిస్తూ, భారీ టూత్‌బ్రష్‌ను త్రాసులా డిజైన్ చేసి, దానిపై వెన్ను వెన్నుకు ఆనుకుని కూర్చున్న ఇద్దరు ప్రధాన పాత్రధారులను పోస్టర్‌లో చూపించారు. ఈ వినూత్న కాన్సెప్ట్ సినిమా కథపై క్యూరియాసిటీని పెంచుతోంది.
తెలుగు సంస్కృతి, ప్రాంతీయతను ప్రతిబింబించే కామెడీ-డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తండ్రీకొడుకులుగా ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, ప్రజ్వల్, గోమతి రెడ్డి, కిరణ్ మాచా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ చిత్రానికి ఉదయ్ చౌహాన్ కథ, దర్శకత్వం వహిస్తున్నారు. ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణాని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సినిమాటోగ్రఫీని వినోద్ కె. బంగారి, సంగీతాన్ని పవన్ సీహెచ్, ప్రొడక్షన్ డిజైన్‌ను క్షితిజ్ జీవన్ రంధీర్ అందిస్తున్నారు.
మేకర్స్ తెలిపిన వివరాల ప్రకారం, త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్లు విడుదల చేయనున్నారు.






