Home తెలంగాణ ‘పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్’ ఇక పూర్తిగా బంద్‌.. మూసివేతకు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు

‘పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్’ ఇక పూర్తిగా బంద్‌.. మూసివేతకు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు

0

‘పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌’కు అధికారికంగా ముగింపు పలికే ప్రక్రియ మొదలైంది. నిబంధనల ఉల్లంఘనలపై భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ఇప్పటికే బ్యాంకింగ్‌ లైసెన్స్‌ను రద్దు చేయగా, ఇప్పుడు ఆ బ్యాంక్‌ను పూర్తిగా మూసివేసే దిశగా మరో కీలక అడుగు పడింది. ఢిల్లీ హైకోర్టు ‘పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌’ను లిక్విడేషన్‌కు పంపాలని ఆదేశించింది. దీంతో బ్యాంక్‌ వ్యవహారాలన్నీ ఇక అధికారిక లిక్విడేటర్‌ ఆధ్వర్యంలో కొనసాగనున్నాయి.

ఆర్‌బీఐ మంగళవారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. జులై 8, జులై 22 తేదీల్లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ను బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ చట్టం-1949, కంపెనీల చట్టం-2013 నిబంధనల కింద మూసివేయాలని ఆదేశించింది. కోర్టు నిర్ణయంతో బ్యాంక్‌ లిక్విడేషన్‌ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. బ్యాంక్‌కు సంబంధించిన పరిపాలనా బాధ్యతలన్నీ ఇక లిక్విడేటర్‌ చేతుల్లోకి వెళ్లాయి.

ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ‘స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’ మాజీ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ గిరికుమార్‌ ఎం. నాయర్‌ను అధికారిక లిక్విడేటర్‌గా హైకోర్టు నియమించింది. బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ చట్టంతో పాటు కంపెనీల చట్టం కల్పించిన అధికారాలన్నీ ఆయన వినియోగించుకోనున్నారు. జులై 8 నుంచే పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ డైరెక్టర్ల బోర్డుకు ఉన్న అధికారాలన్నీ లిక్విడేటర్‌కు బదిలీ అయినట్లు ఆర్‌బీఐ వెల్లడించింది.

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌పై గత కొంతకాలంగా ఆర్‌బీఐ పలు నియంత్రణ చర్యలు తీసుకుంది. పదే పదే నిబంధనలను ఉల్లంఘించడం, నియంత్రణ ప్రమాణాలను పాటించకపోవడాన్ని తీవ్రంగా పరిగణించింది. డిపాజిటర్ల ప్రయోజనాలకు భంగం కలిగే విధంగా బ్యాంక్‌ వ్యవహారాలు సాగుతున్నాయని నిర్ధారించిన ఆర్‌బీఐ, ఈ ఏడాది ఏప్రిల్‌లో బ్యాంకింగ్‌ లైసెన్స్‌ను రద్దు చేసింది. అదే సమయంలో బ్యాంక్‌ను మూసివేయాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించింది.

తాజా ఉత్తర్వులతో ఆ ప్రక్రియకు న్యాయపరమైన ముద్ర పడింది. ఇకపై పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌కు సంబంధించిన ఆస్తులు, బాధ్యతలు, చట్టపరమైన వ్యవహారాలన్నీ అధికారిక లిక్విడేటర్‌ పర్యవేక్షణలో సాగనున్నాయి. బ్యాంక్‌ మూసివేత ప్రక్రియను చట్టబద్ధంగా పూర్తి చేసే బాధ్యత కూడా ఆయనదే. ఈ పరిణామంతో పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ కార్యకలాపాలకు పూర్తిస్థాయిలో ముగింపు పలికినట్లయింది.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version