Home బిజినెస్ SBI ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల.. 9,124 జూనియర్ అసోసియేట్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే

SBI ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల.. 9,124 జూనియర్ అసోసియేట్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే

0

హైదరాబాద్: బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) గుడ్‌న్యూస్ చెప్పింది. జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) పోస్టుల భర్తీ కోసం దేశవ్యాప్తంగా 9,124 ఖాళీలను ప్రకటించింది. భారీ సంఖ్యలో పోస్టులు ఉండటంతో ప్రభుత్వ బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఇది కీలక అవకాశంగా మారింది.

ఎస్బీఐ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ఆగస్టు 11న ప్రారంభమైంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆగస్టు 31 వరకు ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు.

విద్యార్హత

ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే నిబంధనల ప్రకారం వారు 2026 డిసెంబర్ 31 నాటికి డిగ్రీ ఉత్తీర్ణత పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది.

వయోపరిమితి

2026 ఏప్రిల్ 1 నాటికి అభ్యర్థుల వయసు 20 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

తెలంగాణకు 260 పోస్టులు

దేశవ్యాప్తంగా 9,124 పోస్టులు ఉండగా, హైదరాబాద్ సర్కిల్ పరిధిలో 260 ఖాళీలు ఉన్నాయి. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు నగరాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

అనంతపురం, గుంటూరు/విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, చీరాల, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.

దరఖాస్తు ఫీజు

జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.750 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.

మూడు దశల్లో ఎంపిక

ఎస్బీఐ జూనియర్ అసోసియేట్ నియామక ప్రక్రియలో అభ్యర్థులను పలు దశల్లో ఎంపిక చేస్తుంది. ముందుగా ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. సెప్టెంబర్ 26, 27, అక్టోబర్ 3 తేదీల్లో ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది.

ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తదుపరి దశలో మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. మెయిన్స్ పరీక్షను నవంబర్‌లో నిర్వహించనున్నారు. అనంతరం అభ్యర్థుల స్థానిక భాషా ప్రావీణ్యతను పరీక్షించే ప్రక్రియ ఉంటుంది.

స్థానిక భాష తప్పనిసరి

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఒక ముఖ్యమైన నిబంధనను గుర్తుంచుకోవాలి. అభ్యర్థులు ఏదైనా ఒక రాష్ట్రంలోని ఖాళీలకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అంతేకాకుండా తాము దరఖాస్తు చేసుకున్న రాష్ట్రానికి సంబంధించిన స్థానిక భాషలో ప్రావీణ్యం కలిగి ఉండాలి.

ఉద్యోగానికి సంబంధించిన విద్యార్హత, వయోపరిమితి, రిజర్వేషన్, పరీక్షా విధానం, ఫీజు, స్థానిక భాష తదితర పూర్తి వివరాలను అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించాలి. దరఖాస్తు చేసుకునే ముందు నిబంధనలను పూర్తిగా చదివి, సరైన వివరాలతో అప్లికేషన్ సమర్పించడం మంచిది.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version