హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
వానాకాలం రైతు భరోసా నిధులను విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. జూన్ 30న మధిరలో నిర్వహించనున్న రైతు సమ్మేళనంలో సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను విడుదల చేస్తారని చెప్పారు.
రైతులకు ప్రోత్సాహకంగా ఏడు రకాల సన్న బియ్యం వంగడాలకు బోనస్ ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. మార్కెట్లో వాటికి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.
తెలంగాణలో కొనుగోలు చేసిన మొత్తం ధాన్యాన్ని కేంద్రం సేకరించాలని కేబినెట్ సమావేశంలో డిమాండ్ చేసినట్లు తెలిపారు. కేంద్రం కనీస మద్దతు ధర (MSP) కింద కొనుగోలు చేసే ధాన్యాన్ని మాత్రమే రాష్ట్రం కొనుగోలు చేయాలని నిర్ణయించిందన్నారు. ఎరువుల కొరత నేపథ్యంలో తెలంగాణకు కేటాయించాల్సిన ఎరువుల కోటాను వెంటనే విడుదల చేయాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు.
రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి అయ్యే యూరియాలో అధిక భాగాన్ని తెలంగాణకు కేటాయించాలని కేంద్రాన్ని కోరినట్లు మంత్రి తెలిపారు. అలాగే హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఐఆర్‌ఎఫ్‌సీ (IRFC) నుంచి రాష్ట్రానికి రావాల్సిన రుణాలను వెంటనే విడుదల చేయాలని కూడా కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు.
రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టుల అనుమతుల విషయంలో సహకరించాలని బీజేపీ ఎంపీలకు మంత్రి ఉత్తమ్ పిలుపునిచ్చారు. ఇకపై కేబినెట్ సమావేశాలను డిజిటల్ విధానంలో నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
జూన్ 21న నిర్వహించనున్న నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని కేబినెట్ నిర్ణయించినట్లు తెలిపారు.
అదేవిధంగా వీబీ-జీ ర్యామ్‌జీ (VB-G RAM G) అంశంపై అధ్యయనం చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ కమిటీలో మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సభ్యులుగా ఉంటారని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేసి జూన్ 25లోపు ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.






