తెలంగాణలో భూమి కొనాలనుకునే వారు, అమ్మాలనుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం కీలక షాక్ ఇచ్చింది. భూములు, ప్లాట్లు, అపార్ట్‌మెంట్ల మార్కెట్ విలువలను సవరించిన ప్రభుత్వం కొత్త రేట్లను జూన్ 5 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో రాష్ట్రంలోని 144 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగే అన్ని రిజిస్ట్రేషన్లు ఇకపై కొత్త మార్కెట్ విలువల ఆధారంగానే జరగనున్నాయి.
ప్రభుత్వ నిర్ణయంతో వ్యవసాయ భూముల విలువలు 50 శాతం నుంచి 100 శాతం వరకు పెరిగాయి. ప్లాట్ల ధరల్లో కూడా భారీ మార్పులు చోటుచేసుకోగా, అపార్ట్‌మెంట్ల విలువలను మాత్రం 10 నుంచి 20 శాతం వరకు మాత్రమే పెంచారు. రాష్ట్రంలో ఎకరాకు కనిష్ఠ మార్కెట్ విలువ గతంలో రూ.1.75 లక్షలు ఉండగా, ఇప్పుడు అది రూ.2.75 లక్షలకు చేరింది.
ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భూముల విలువలు భారీగా పెరిగాయి. కోకాపేట, కొంగరకలాన్, రాయదుర్గం, హఫీజ్‌పేట్, నాగోల్ వంటి ప్రాంతాలు ఈ పెంపులో ముందున్నాయి. కోకాపేటలో ఎకరా విలువ రూ.30 లక్షల నుంచి రూ.60 లక్షలకు రెట్టింపు కాగా, నాగోల్‌లో రూ.11 కోట్ల నుంచి రూ.20 కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో జిల్లాల్లోనూ భూముల మార్కెట్ విలువలు గణనీయంగా పెరగడంతో రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా పెరగనున్నాయి.
భూముల అసలు మార్కెట్ ధరలకు, ప్రభుత్వ మార్కెట్ విలువలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. దీంతో రియల్ ఎస్టేట్ రంగంలో ఈ నిర్ణయం కీలక ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు.
