Home తెలంగాణ అంజయ్యనగర్ భవన ప్రమాదం.. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం

అంజయ్యనగర్ భవన ప్రమాదం.. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం

35
0

హైదరాబాద్‌లోని అంజయ్యనగర్‌లో ఏడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటన నగరంలో అక్రమ నిర్మాణాలపై మరోసారి ఆందోళన రేకెత్తించింది. ఒకప్పుడు అటవీ ప్రాంతంగా ఉన్న ఈ ప్రాంతం ఐటీ అభివృద్ధితో రియల్ ఎస్టేట్ హబ్‌గా మారింది. అయితే చిన్నచిన్న స్థలాల్లోనూ నిబంధనలను పట్టించుకోకుండా బహుళ అంతస్తుల భవనాలు నిర్మించడం ప్రమాదాలకు కారణమవుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

50 నుంచి 60 గజాల స్థలాల్లో సైతం కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా ఏడంతస్తుల వరకు నిర్మాణాలు చేపట్టడమే అంజయ్యనగర్ ప్రమాదానికి కారణమైందని ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

అక్రమ నిర్మాణాల విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించడాన్ని సీఎం ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే నిర్మాణాలను సహించేది లేదని, అక్రమ కట్టడాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం.

సీఎం ఆదేశాలతో జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. మంగళవారం ఒక్కరోజే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 17 అనధికార నిర్మాణాలను కూల్చివేశారు. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ జోన్లలో ఈ కూల్చివేతలు జరిగాయి.

ఇప్పటివరకు మూడు జోన్ల పరిధిలో 54 అక్రమ నిర్మాణాలను గుర్తించిన అధికారులు.. నిర్మాణ దశలో ఉన్న అనధికార కట్టడాలపై వేగంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

మరోవైపు అంజయ్యనగర్ భవన ప్రమాదానికి సంబంధించి ప్రధాన నిందితుడిగా భావిస్తున్న కాంట్రాక్టర్ మహ్మద్ ఖాజామియాను పోలీసులు అరెస్ట్ చేశారు. నాసిరకం నిర్మాణ సామగ్రిని ఉపయోగించడంతో పాటు, ప్రమాదాన్ని ముందే గుర్తించినప్పటికీ అధికారులకు సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోయినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం.

గచ్చిబౌలి టీఎన్‌జీవో కాలనీ సహా నగరంలోని పలు ప్రాంతాల్లోనూ ఇదే తరహా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జరిగిన ఘటన నేపథ్యంలో అక్రమ నిర్మాణాలపై అధికారులు మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని వారు కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here