Home తెలంగాణ సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. కంటైనర్‌ను ఢీకొట్టిన బస్సు.. ఆరుగురు మృతి

సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. కంటైనర్‌ను ఢీకొట్టిన బస్సు.. ఆరుగురు మృతి

16
0

సూర్యాపేట జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోదాడ మండలం దొరకుంట శివారులో జాతీయ రహదారిపై ఆగి ఉన్న కంటైనర్ లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు మృతి చెందగా.. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.

హైదరాబాద్ నుంచి 42 మంది ప్రయాణికులతో బస్సు ఏలూరుకు బయలుదేరింది. దొరకుంట సమీపంలోకి రాగానే రహదారిపై నిలిపి ఉన్న కంటైనర్‌ను డ్రైవర్ గమనించకపోవడంతో బస్సు బలంగా ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ప్రమాద ధాటికి బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది.

ప్రమాద సమయంలో ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండటంతో ఒక్కసారిగా జరిగిన ఘటనతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మృతుల్లో ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరో మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసి.. క్షతగాత్రులను అంబులెన్స్‌ల ద్వారా కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here