TGN NEWS (మేడ్చల్): గుండ్లపోచంపల్లి డివిజన్‌కు చెందిన ముదునూరి విజయ దుర్గా అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ముఖ్యమంత్రి సహాయనిధి (CM Relief Fund) ద్వారా ఆర్థిక సాయం అందింది. బాధితురాలు తనకు సహాయం చేయాలని గుండ్లపోచంపల్లి మాజీ సర్పంచ్ మద్దుల శ్రీనివాస్ రెడ్డిని కోరగా, ఆయన వెంటనే స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే మల్లారెడ్డి చొరవతో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.2 లక్షల విలువైన LOC (Letter of Credit) మంజూరైంది. శుక్రవారం మల్లారెడ్డి తన చేతుల మీదుగా బాధితురాలికి ఆ LOCను అందజేశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందులతో చికిత్స పొందలేని పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో అండగా నిలుస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు బేరి బాల్‌రాజ్, అమరం జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
