హైదరాబాద్‌లో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ (ఎల్‌ఐజీ ఫ్లాట్లు) లబ్ధిదారుల ఎంపికకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఆగస్టు 28 నుంచి 31 వరకు నాలుగు రోజుల పాటు లక్కీ డ్రా నిర్వహించనున్నారు. పూర్తి పారదర్శకత కోసం డ్రా ప్రక్రియను యూట్యూబ్‌తో పాటు ఇతర సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
హైదరాబాద్ క్యూర్ (సీయూఆర్ఈ) పరిధిలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్మించిన మొత్తం 7,340 ఫ్లాట్ల కోసం 60,720 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల పరిశీలన అనంతరం 40,900 మందిని అర్హులుగా గుర్తించగా.. 19,820 దరఖాస్తులను వివిధ కారణాలతో అనర్హులుగా తేల్చారు. అర్హులైన దరఖాస్తుదారుల నుంచే లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు.
హౌసింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ వీపీ గౌతం మాట్లాడుతూ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉంటుందని తెలిపారు. ఫ్లాట్ ఇప్పిస్తామని చెప్పే మధ్యవర్తులను నమ్మవద్దని, డబ్బులు తీసుకుని హామీ ఇచ్చే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
దరఖాస్తుదారులు, మీడియా ప్రతినిధుల సమక్షంలోనే డ్రా నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా రిజర్వేషన్ల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, శానిటేషన్ వర్కర్లకు కేటాయింపులు ఉంటాయని తెలిపారు.
