Home జాతీయం తమిళనాడులో విజయ్ విజయం.. తెలుగు హీరోలకు సాధ్యం కాదా? జేపీ కీలక వ్యాఖ్యలు

తమిళనాడులో విజయ్ విజయం.. తెలుగు హీరోలకు సాధ్యం కాదా? జేపీ కీలక వ్యాఖ్యలు

0

తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) సాధించిన రాజకీయ విజయంపై లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ (జేపీ) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో విజయ్ సాధించిన తరహా విజయాన్ని తెలుగు రాష్ట్రాల్లో సినీ హీరోలు సాధించడం అంత సులభం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

అవినీతి అంతం కావాలని ప్రజలు కోరుకుంటున్నప్పటికీ.. దాని కోసం ఉద్యమించేందుకు మాత్రం ముందుకు రావడం లేదని జేపీ విశ్లేషించారు. ప్రజల్లో మార్పు కోరుకునే ఆలోచన ఉన్నా, వ్యవస్థలో మార్పు కోసం దీర్ఘకాలికంగా పోరాడే నిబద్ధత తక్కువగా ఉందని పేర్కొన్నారు.

రజినీకాంత్, కమల హాసన్ వంటి అగ్ర నటులకు కూడా పూర్తిస్థాయి రాజకీయ విజయాన్ని అందుకోలేకపోయారని గుర్తుచేసిన జేపీ.. విజయ్ మాత్రం ఊహించని స్థాయిలో రాజకీయంగా ఎదిగారని అన్నారు.

ముఖ్యంగా జెన్-జీ తరం ‘ఒకే ఒక్కడు’ సినిమాలో చూపించినట్టుగా ఒక్క వ్యక్తి వచ్చి రాత్రికి రాత్రే వ్యవస్థను మార్చాలని ఆశిస్తోందని జేపీ వ్యాఖ్యానించారు. అయితే వాస్తవ జీవితంలో వ్యవస్థాగత మార్పులకు చాలా సమయం పడుతుందని స్పష్టం చేశారు.

జెన్-జీ ఉద్యమాలు ప్రారంభించినా వాటి ఫలితాలు రావడానికి 10 నుంచి 15 సంవత్సరాలు పట్టవచ్చని ఆయన అన్నారు. కేవలం ఒక నాయకుడు లేదా ఒక సినీ హీరోతోనే అవినీతి నిర్మూలన, పరిపాలనా సంస్కరణలు సాధ్యం కావని పేర్కొన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో కూడా అవినీతిపై ప్రజల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ.. దానిని సమష్టి ఉద్యమంగా మార్చడంలో ప్రజలు వెనుకబడుతున్నారని జేపీ అభిప్రాయపడ్డారు. అందుకే ఇక్కడ సినీ హీరోలు రాజకీయాల్లోకి వచ్చినా విజయ్ స్థాయి రాజకీయ విజయాన్ని సాధించడం కష్టమని ఆయన విశ్లేషించారు.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version