వనపర్తి కాంగ్రెస్‌లో అంతర్గత అసంతృప్తి మరోసారి బయటపడింది. కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి పార్టీ నిర్ణయాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో తనకు టికెట్ రాకపోవడానికి డబ్బు కారణమని ఆరోపించారు.
45 ఏళ్లుగా కాంగ్రెస్ కోసం పనిచేస్తున్న తనలాంటి నేతలను పక్కన పెట్టి, గతంలో పార్టీకి దూరంగా ఉన్నవారికి టికెట్లు ఇవ్వడం సరికాదని అన్నారు. బీఆర్‌ఎస్‌లోకి వెళ్లి తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చిన వారికి మళ్లీ ప్రాధాన్యత ఇవ్వడంపై ఆయన ప్రశ్నలు సంధించారు.
వనపర్తిని సర్వనాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన చిన్నారెడ్డి.. తనకు ఎమ్మెల్యేగా, మంత్రిగా అవకాశం వచ్చి ఉంటే నియోజకవర్గానికి మరింత అభివృద్ధి జరిగేదన్నారు.
అయితే పార్టీని వీడబోనని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లోనే కొనసాగుతూ పార్టీలో జరుగుతున్న తప్పులను ప్రశ్నిస్తానన్నారు. కాంగ్రెస్‌కు అన్యాయం చేస్తున్న వారిని బయటకు పంపించే వరకు పోరాడతామని చెప్పారు.
