Home తెలంగాణ హైదరాబాద్‌కు మరో కీలక వైద్య అధ్యాయం.. నేడు డా.ఎంసీఆర్‌ టిమ్స్‌ ప్రారంభం

హైదరాబాద్‌కు మరో కీలక వైద్య అధ్యాయం.. నేడు డా.ఎంసీఆర్‌ టిమ్స్‌ ప్రారంభం

0

హైదరాబాద్‌ నగర వైద్య మౌలిక సదుపాయాల్లో మరో కీలక ఘట్టానికి సోమవారం శ్రీకారం చుట్టనున్నారు. ఎర్రగడ్డలో అత్యాధునిక వసతులతో నిర్మించిన మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (డా.ఎంసీఆర్‌ టిమ్స్‌) సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం సాయంత్రం 4.30 గంటలకు లాంఛనంగా ప్రారంభించనున్నారు.

ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర్‌ రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.

సుమారు 22.6 ఎకరాల విస్తీర్ణంలో రూ.1,100 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన ఈ ఆసుపత్రిలో 1,000 పడకల సామర్థ్యం ఉంది. ఐదు బ్లాకులతో అత్యాధునిక వైద్య సదుపాయాలతో దీనిని తీర్చిదిద్దారు. ఇప్పటికే ట్రయల్‌ రన్‌ నిర్వహించడంతో పాటు డే కేర్‌ విభాగాలను ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ప్రస్తుతం రోజుకు సుమారు 250 మంది రోగులకు వైద్య సేవలు అందుతున్నాయి.

గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌ వంటి ప్రధాన ఆసుపత్రుల నుంచి బదిలీపై వచ్చిన వైద్య సిబ్బందితో పాటు కొత్తగా నియమితులైన సుమారు 200 మంది వైద్య సిబ్బంది ఇక్కడ సేవలు అందించనున్నారు. మాజీ డీఎంఈ డా.ఎ.నరేంద్రకుమార్‌ ఇన్‌ఛార్జి డైరెక్టర్‌గా, మాజీ ఏడీఎంఈ డా.మహబూబ్‌ ఖాన్‌ ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు.

ప్రారంభోత్సవ ఏర్పాట్లను వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ ఆదివారం సమీక్షించారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి అధికారులతో సమావేశమయ్యారు. కార్యక్రమానికి వచ్చే ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా ప్రతినిధులు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పోలీసు శాఖకు సూచించారు.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version