Home ఆంధ్రప్రదేశ్ ఒంగోలులో వేడెక్కిన రాజకీయం.. దామచర్లకు బాలినేని సవాల్

ఒంగోలులో వేడెక్కిన రాజకీయం.. దామచర్లకు బాలినేని సవాల్

50
0

“జైల్లో వేసేంత మగాడివా?” అంటూ తీవ్ర వ్యాఖ్యలు.. అభివృద్ధిపై ముఖాముఖీ చర్చకు సిద్ధమన్న మాజీ మంత్రి

ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలులో రాజకీయ వేడి మరింత పెరిగింది. స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు బాలినేని ఘాటుగా స్పందిస్తూ.. ప్రజా సమస్యలు, నియోజకవర్గ అభివృద్ధిపై ముఖాముఖీ చర్చకు రావాలని సవాల్ విసిరారు.

దామచర్ల జనార్ధన్ హయాంలో ఒంగోలు నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని బాలినేని ఆరోపించారు. రాత్రి వేళల్లో సెటిల్మెంట్లు, అక్రమ వ్యవహారాలు జరుగుతున్నాయంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇసుక ధరలు పెరగడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకోవాలని కోరారు.

ప్రమాణానికి రావాలని సవాల్

తనపై, తన వర్గంపై వస్తున్న ఆరోపణలకు సమాధానంగా బాలినేని మరో సవాల్ విసిరారు. దమ్ముంటే కాణిపాకం ఆలయంలో ప్రమాణానికి రావాలని అన్నారు. అంతేకాకుండా తమ పదవులకు రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థులుగా ఒంగోలు బరిలో నిలబడి ప్రజల తీర్పు కోరుదామని ప్రతిపాదించారు.

“జైల్లో వేసేంత మగాడివా?” అంటూ దామచర్లను ఉద్దేశించి బాలినేని చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.

కూటమి ప్రభుత్వంపై అసంతృప్తి

కూటమి ప్రభుత్వంలో జనసేన భాగస్వామిగా ఉన్నప్పటికీ తమకు తగిన ప్రాధాన్యత, అధికారాలు లభించడం లేదని బాలినేని అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ పరిస్థితులపై పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు కూడా అవగాహన ఉందని, అయినప్పటికీ తాము సర్దుకుపోతున్నామని పేర్కొన్నారు.

తన కుమారుడిపై వస్తున్న ఆరోపణలను బాలినేని ఖండించారు. ఒంగోలు నియోజకవర్గ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసమే తాము పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. తాజా సవాళ్లు, ఆరోపణలతో ఒంగోలు రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here