Home ఆంధ్రప్రదేశ్ కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు ఫైర్.. అధికారులపై తీవ్ర ఆగ్రహం

కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు ఫైర్.. అధికారులపై తీవ్ర ఆగ్రహం

6
0

అమరావతి: ప్రభుత్వ పాలనలో వేగం పెంచే లక్ష్యంతో నిర్వహిస్తున్న కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొందరు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో రెండు రోజుల పాటు జరుగుతున్న ఈ సమావేశానికి కొందరు శాఖాధిపతులు గైర్హాజరు కావడం, ప్రభుత్వ ఫైళ్ల పరిష్కారంలో జాప్యం జరుగుతుండటంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు.

సదస్సుకు హాజరుకాని అధికారులపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. సమావేశానికి గైర్హాజరు కావడానికి అధికారులకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. సమావేశానికి రాని అధికారులందరి నుంచి వెంటనే సంజాయిషీ కోరాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌ను ఆదేశించారు.

అధికారులు సమావేశానికి వచ్చినప్పుడు మొబైల్ ఫోన్లను తీసుకురావద్దని సీఎం సూచించారు. కనీసం 12 గంటల పాటు ఏకాగ్రతతో సమావేశంలో పాల్గొనలేరా అని ప్రశ్నించారు. మంత్రులు కూడా తమ శాఖల అధికారులతో ముందుగానే సమీక్షలు నిర్వహించి, పూర్తి సమాచారంతో సదస్సుకు హాజరు కావాలని సూచించారు.

ఫైళ్ల పెండింగ్‌పై సీఎం ఆగ్రహం

ఫైళ్ల క్లియరెన్స్‌కు సంబంధించి ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ సమర్పించిన గణాంకాలను చంద్రబాబు పరిశీలించారు. గతంతో పోలిస్తే ఫైళ్ల పరిష్కారంలో పరిస్థితి మెరుగుపడినప్పటికీ, కొందరు శాఖాధిపతులు ఇంకా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఫైళ్లను రోజుల తరబడి పెండింగ్‌లో ఉంచుతున్న అధికారుల పేర్లను ప్రస్తావిస్తూ వారిని వివరణ కోరారు. ఇకపై ఆఫ్‌లైన్ ఫైళ్లకు అవకాశం ఉండకూడదని స్పష్టం చేశారు. అవసరమైతే అధికారులకు ఐటీ నైపుణ్యాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు. పరిశ్రమల శాఖ కమిషనర్ వద్ద ఫైళ్లు 10 రోజులుగా పెండింగ్‌లో ఉండటంపై సీఎం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

మరోవైపు కలెక్టర్లు చేపడుతున్న వినూత్న కార్యక్రమాలను చంద్రబాబు అభినందించారు. ప్రతి జిల్లాను పరిశోధన, అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఒక జిల్లాలో విజయవంతమైన విధానాలను ఇతర జిల్లాల్లోనూ అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here