Home తెలంగాణ గోదావరి ఉగ్రరూపం.. ఇంకా ముంపులోనే లంక గ్రామాలు

గోదావరి ఉగ్రరూపం.. ఇంకా ముంపులోనే లంక గ్రామాలు

0

ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. వరద పోటెత్తడంతో కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు వణికిపోతున్నాయి. స్థానికంగా వర్షాలు తగ్గుముఖం పట్టినా, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటకల నుంచి భారీగా వస్తున్న వరద నీటితో గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో లంక గ్రామాలు నీట మునిగి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కోనసీమ జిల్లాలోని అనేక లంక గ్రామాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి. ముమ్మిడివరం నియోజకవర్గంలోని లంక గ్రామాల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. గోగులంక, గుత్తెనదీవి, కేసనకుర్రు వంటి ప్రాంతాల్లో బోట్ల సర్వీసులను పూర్తిగా నిలిపివేశారు. తానేలంక – గురజాపులంక మధ్య రహదారిపై వరద నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. అప్పనపల్లి, ముక్తేశ్వరం, కనకాయలంక, అయ్యినవిల్లిలంక, వీరవల్లిపాలెం, అద్దంకివారిలంక వంటి అనేక గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. కొబ్బరి రైతులు తమ పంటను కాపాడుకునేందుకు ట్రాక్టర్ల సహాయంతో కాయలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

రాజమండ్రి వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో నదీ తీరం కోతకు గురవుతోంది. అధికారులు ఇసుక బస్తాలు వేసి కోతను అరికట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం చింతపల్లి వద్ద, గౌతమి పాయ ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. అయితే, గత రాత్రితో పోలిస్తే ప్రవాహం స్వల్పంగా తగ్గింది. భారీగా వస్తున్న వరద నీరు సముద్రంలోకి వెళుతోంది.

మరోవైపు, ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాలను ఎమ్మెల్యే బాలరాజు, ఎస్పీ ప్రశాంత్ కిశోర్ పరిశీలించారు. అధికారులు కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి, లంక గ్రామాల ప్రజలను నిరంతరం అప్రమత్తం చేస్తున్నారు. కలెక్టర్ మహేశ్ కుమార్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ, అధికారులకు తగిన సూచనలు జారీ చేస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేసి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version