Home తెలంగాణ తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేత

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేత

0

తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో క్యూలైన్లు వెలుపల వరకు విస్తరించాయి. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది.

గురువారం దర్శనానికి సంబంధించి బుధవారం జారీ చేయాల్సిన సర్వదర్శనం (SSD) టోకెన్లను నిలిపివేసింది. ప్రస్తుతం టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు.

టోకెన్ల కోసం తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్‌ల వద్దకు రావొద్దని అధికారులు సూచించారు. టోకెన్ లేని భక్తులు నేరుగా తిరుమలకు చేరుకుని సర్వదర్శనం క్యూలైన్లలోకి వెళ్లాలని కోరారు.

అయితే శుక్రవారం దర్శనం కోసం గురువారం యథావిధిగా టోకెన్ల జారీ కొనసాగుతుందని టీటీడీ స్పష్టం చేసింది.

మంగళవారం శ్రీవారిని 78,956 మంది భక్తులు దర్శించుకోగా.. 31,014 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.4.46 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా.. ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version