Home తెలంగాణ తెలంగాణలో ‘టీజీ సేఫ్‌’.. ఫుడ్‌, డ్రగ్స్‌ కంట్రోల్‌ ఇక ఒకే గొడుగు కింద

తెలంగాణలో ‘టీజీ సేఫ్‌’.. ఫుడ్‌, డ్రగ్స్‌ కంట్రోల్‌ ఇక ఒకే గొడుగు కింద

20
0

ఆహారం, ఔషధాల నాణ్యతపై పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త వ్యవస్థను తీసుకొచ్చింది. ఫుడ్‌ సేఫ్టీ, డ్రగ్స్‌ కంట్రోల్‌ విభాగాలను విలీనం చేసి ‘టీజీ సేఫ్‌’ పేరుతో ఏకీకృత సంస్థను ఏర్పాటు చేసింది. ప్రజలకు నాణ్యమైన ఆహారం, సురక్షితమైన ఔషధాలు అందేలా నియంత్రణ వ్యవస్థను బలోపేతం చేయడమే ఈ నిర్ణయం ఉద్దేశం.

‘తెలంగాణ స్టాండర్డ్స్‌ అథారిటీ ఫర్‌ ఫుడ్‌ అండ్‌ ఎసెన్షియల్‌ డ్రగ్స్‌’గా పిలిచే ఈ సంస్థకు ఐపీఎస్‌ అధికారి అవినాశ్‌ మహంతిని కమిషనర్‌గా నియమించారు. గతంలో ఆయన డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డీజీగా బాధ్యతలు నిర్వర్తించారు.

కల్తీ, నకిలీ ఆహార పదార్థాలు, నాణ్యత లేని ఔషధాలను అరికట్టేందుకు రెండు విభాగాల మధ్య సమన్వయం అవసరమని ప్రభుత్వం పేర్కొంది. ప్రజారోగ్యం, వినియోగదారుల భద్రత, నాణ్యతా ప్రమాణాలు వంటి ఉమ్మడి లక్ష్యాల నేపథ్యంలో ఈ రెండు విభాగాలను ఏకీకృతం చేసినట్లు తెలిపింది.

‘టీజీ సేఫ్‌’ పరిధిలో డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌, ఫుడ్‌ సేఫ్టీ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌, లీగల్‌ అండ్‌ ప్రాసిక్యూషన్‌, లేబొరేటరీ, పరిపాలనా విభాగాలు పనిచేయనున్నాయి. సంబంధిత చట్టాల ప్రకారం అధికారులకు ఉన్న అధికారాల్లో ఎలాంటి మార్పు ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

అదేవిధంగా నియంత్రణ వ్యవస్థను మరింత ఆధునికంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నారు. క్షేత్రస్థాయి విభాగాలు, ల్యాబొరేటరీల మౌలిక సదుపాయాలు, సర్వీస్‌ రూల్స్‌ తదితర అంశాలను సమీక్షించి మెరుగైన విధానాలపై కమిటీ సూచనలు చేయనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here