Home తెలంగాణ నల్లగొండ జిల్లాలో ప్రత్యక్షమైన భూపాలపల్లి ఎన్నికల బ్యాలెట్‌ బాక్స్‌

నల్లగొండ జిల్లాలో ప్రత్యక్షమైన భూపాలపల్లి ఎన్నికల బ్యాలెట్‌ బాక్స్‌

1
0

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాకు చెందినదిగా అనుమానిస్తున్న ఎన్నికల బ్యాలెట్‌బాక్స్‌ నల్లగొండ జిల్లాలోని పాత ఇనుపసామగ్రి దుకాణంలో ప్రత్యక్షమవడం రాష్ట్రవ్యాప్తంగా కలకలంరేపింది. ఎన్నికలు ముగిసిన తర్వాత బ్యాలెట్‌ బాక్సులను స్ట్రాంగ్‌ రూముల్లో భద్రపరచాలి. అందుకు భిన్నంగా భూపాలపల్లి జిల్లాకు చెందిన టీఎస్‌ ఈసీ జేఎస్‌బీపీ పేరుతో ఉన్న బ్యాలెట్‌బాక్స్‌ నల్లగొండ జిల్లాలోని పాత ఇనుపసామగ్రి దుకాణంలో కనిపించింది.

మిస్సయిన బ్యాలెట్‌ బాక్స్‌లో ఒకటే ఉందా…? లేక మరికొన్ని ఉన్నాయా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 3,507 బాక్సులను ఉపయోగించామని, వాటిలో మహారాష్ట్రకు చెందిన 300, గుజరాత్‌కు చెందిన 595, భూపాలపల్లి జిల్లాకు చెందిన 2,612 బాక్సులు ఉన్నాయి. ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తికాగానే వాటిని ఆయా మండలాల్లోని స్ట్రాంగ్‌ రూమ్‌లో ఎంపీడీవో ఆధ్వర్యంలో భద్రపరుచామని జిల్లా పంచాయతీ అధికారి శ్రీలత తెలుపగా, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 14 బాక్స్‌లు ఉపయోగించామని, అవి తమవద్దే ఉన్నాయని కలెక్టరేట్‌ ఏవో శ్రీనివాసులు తెలిపారు.

మరి నల్లగొండలో ప్రత్యక్షమైన బాక్స్‌ ఎక్కడిదనే ప్రశ్నలు జిల్లా ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ నియోజకవర్గంలో గ్రాడ్యుయేషన్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు రెండేండ్ల క్రితం నిర్వహించారు. ఈ క్రమంలో కౌంటింగ్‌ కోసం బ్యాలెట్‌ బాక్స్‌లను నల్లగొండ జిల్లాకు తరలించారు.ఈ ఎన్నికల్లో భూపాలపల్లి జిల్లాలో 69.16 శాతం ఓట్లు నమోదయ్యాయి.

నల్లగొండలో లభించిన బ్యాలెట్‌ బాక్స్‌ గ్రాడ్యుయేషన్‌ ఎన్నికలకు సంబంధించిందా..? కౌంటింగ్‌లో ఏమైనా అవకతవకలు జరిగియా..? కావాలనే ఈ బ్యాలెట్‌ బాక్స్‌ను అధికారులు మిస్‌ చేశారా..? అని ఓటర్లు అనుమానపడుతున్నారు. ఎన్నికలు పూర్తన వెంటనే బాక్స్‌లు జిల్లాకు రావాల్సి ఉండగా, నల్లగొండలో ప్రత్యక్షమవడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి ఓడిపోగా, కాంగ్రెస్‌ బలపరిచిన అభ్యర్థి తీన్నార్‌ మల్లన్న గెలుపొందడంపై జిల్లా గ్రాడ్యుయేట్లలో పెద్ద అనుమానమే వ్యక్తమవుతున్నది.

విచారణ చేస్తున్నాం..
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాకు చెందిన బ్యాలెట్‌ బాక్స్‌ నల్లగొండ జిల్లాలో ఇనుప సామగ్రి దుకాణంలో ప్రత్యక్షమవడంపై జిల్లా ఎన్నికల అధికారులు పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నారు. ఎన్నికలయ్యాక బ్యాలెట్‌ బాక్స్‌లు జిల్లాకు పంపండంలో ఏమైనా పొరపాటు జరిగిందా..? లేక బాక్స్‌లకు పేర్లు రాయడంలో తప్పిదం జరిగిందా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. ఈ విషయమై నల్లగొండలో పోలీసులు సైతం దర్యాప్తును ప్రారంభించారు. బాక్స్‌ బయటకు రావడానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here