GHMCలో బిల్లుల కుంభకోణం కలకలం.. ఒకే పనికి రెండుసార్లు పేమెంట్లు?
జీహెచ్‌ఎంసీలో కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఒకే సివిల్ పనికి సంబంధించిన బిల్లులను రెండుసార్లు చెల్లించినట్లు గుర్తించడంతో కోట్లాది రూపాయల ప్రజాధనం పక్కదారి పట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బిల్లుల చెల్లింపుల కోసం ఉపయోగిస్తున్న ‘ట్రెండ్స్’ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసే సమయంలో డేటాలో మిస్‌మ్యాచ్‌లు గుర్తించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఒకే పనికి సంబంధించిన రికార్డులు, వర్క్ ఆర్డర్ల ఆధారంగా రెండుసార్లు పేమెంట్లు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో డబుల్ పేమెంట్లు పొందినట్లు అనుమానిస్తున్న కాంట్రాక్టర్ల జాబితాను అధికారులు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అదనంగా చెల్లించిన మొత్తాలను తిరిగి జీహెచ్‌ఎంసీ ఖజానాలో జమ చేయాలని ఆదేశించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇక ఈ అక్రమ చెల్లింపుల్లో కాంట్రాక్టర్లతో పాటు సంబంధిత ఫైనాన్స్, అకౌంట్స్ విభాగాల అధికారుల పాత్రపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాఫ్ట్‌వేర్ లోపాలను ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఉపయోగించారా? లేక పర్యవేక్షణ లోపం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందా? అనే అంశాలపై విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం.
పూర్తి స్థాయి విచారణ అనంతరం అసలు వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉంది. ప్రజాధనం దుర్వినియోగం జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.






