హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవంగా నిర్వహించే ఆషాఢ మాసం బోనాల జాతర నేటి (జూలై 16) నుంచి ప్రారంభం కానుంది. చారిత్రాత్మక గోల్కొండ కోటపై వెలసిన శ్రీ జగదాంబిక ఎల్లమ్మ మహంకాళి ఆలయంలో జరిగే తొలి పూజలతో రాష్ట్రవ్యాప్తంగా బోనాల ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు.
ప్రభుత్వం తరఫున మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ లంగర్‌హౌస్‌లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని బోనాల ఉత్సవాలను అధికారికంగా ప్రారంభించనున్నారు. అనంతరం సంప్రదాయబద్ధంగా పోతురాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్లు, తొట్టెల ఊరేగింపులు నడుమ భక్తులు గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక ఎల్లమ్మ మహంకాళి ఆలయానికి బోనాలు సమర్పించనున్నారు.
ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనం సమర్పించడం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా భావిస్తారు. ఈ నెలంతా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహంకాళి ఆలయాల్లో బోనాల ఉత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించనున్నారు.
బోనాల జాతర సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక అలంకరణలు, పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేయగా, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి.
తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకగా నిలిచిన బోనాల జాతరతో రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది.
