ప్రాసెస్డ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, శారీరక శ్రమ లేని జీవనశైలి కారణంగా భారతీయుల్లో ఊబకాయం వేగంగా పెరుగుతోందని ఏఐజీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఊబకాయాన్ని కేవలం బరువు పెరగడంగా కాకుండా శరీరంలోని ప్రతి అవయవాన్ని ప్రభావితం చేసే జీవక్రియ వ్యాధిగా గుర్తించాలని సూచిస్తున్నారు.
డాక్టర్ కపాల తెలిపిన వివరాల ప్రకారం.. మార్కెట్లో లభించే ప్రాసెస్డ్ ఫుడ్‌లో అధిక కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, చక్కెరలు ఉండటంతో ఆకలి నియంత్రణ దెబ్బతింటుంది. ఫలితంగా అతిగా తినడం, బరువు పెరగడం, ఫ్యాటీ లివర్, మధుమేహం వంటి సమస్యలు వస్తాయి.
ముఖ్యంగా ఫ్యాటీ లివర్ ఎలాంటి లక్షణాలు లేకుండానే ముదిరిపోతుందని, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరమన్నారు.
ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం, పిల్లల్లో ఆటలకు సమయం తగ్గిపోవడం, చదువుల ఒత్తిడి కూడా జీవక్రియ వ్యాధులకు దారితీస్తున్నాయని వైద్యులు వెల్లడించారు. ఆరోగ్యకరమైన ఆహారం, ప్రతిరోజూ వ్యాయామం, సమయానికి నిద్ర, ఒత్తిడి నియంత్రణతో ఈ సమస్యలను చాలా వరకు నివారించవచ్చని సూచించారు.
