తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు బుధవారం భారీగా తగ్గాయి. హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో పసిడి, వెండి ధరలు ఒక్కసారిగా కిందికి దిగివచ్చాయి. కిలో వెండి ధర ఏకంగా రూ.10,000 తగ్గగా.. 24 క్యారెట్ల బంగారం తులం ధర రూ.2,680 మేర పడిపోయింది.
తాజా మార్పులతో హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,090కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,41,250గా నమోదైంది. కిలో వెండి ధర రూ.10,000 తగ్గి రూ.2,50,000 వద్ద స్థిరపడింది.
గత మూడు రోజుల్లోనే 10 గ్రాముల బంగారం ధర రూ.6,000కు పైగా తగ్గడం గమనార్హం. దీంతో ఇటీవల భారీగా పెరిగిన పసిడి ధరలు వరుసగా దిగివస్తున్నాయి.
అంతర్జాతీయ పరిణామాల ప్రభావం
ఇరాన్‌పై అమెరికా మళ్లీ సైనిక దాడులు ప్రారంభించడంతో అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి పెరిగిందని, దీనికి తోడు ముడిచమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు బంగారం నుంచి ఇతర పెట్టుబడి మార్గాల వైపు మళ్లుతున్నారని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై అంచనాలు, డాలర్ కదలికలు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ఔన్సుకు 106 డాలర్లు తగ్గి 4,323 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. స్పాట్ సిల్వర్ 3.20 శాతం నష్టపోయి ఔన్సుకు 64 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
అయితే ఇవి బుధవారం ఉదయం నమోదైన ధరలు మాత్రమేనని, అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలకు అనుగుణంగా రోజులో ధరల్లో మార్పులు ఉండొచ్చని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి.
