Home తెలంగాణ మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే కోవ లక్ష్మి మధ్య వాగ్వాదం.. ప్రభుత్వ కార్యక్రమంలో హీట్

మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే కోవ లక్ష్మి మధ్య వాగ్వాదం.. ప్రభుత్వ కార్యక్రమంలో హీట్

0

ఆసిఫాబాద్: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమం రాజకీయ వాగ్వాదానికి వేదికైంది. రాష్ట్ర మంత్రి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరిగింది. ఇందిరమ్మ మైనారిటీ మహిళా శక్తి పథకం కింద కుట్టు మిషన్ల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

కార్యక్రమంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో రూ.2.50 కోట్లతో చేపట్టనున్న సమేల రోడ్డు, రూ.1.50 కోట్లతో చేపట్టనున్న పాతగూడ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసినా ఇప్పటివరకు పనులు ఎందుకు ప్రారంభం కాలేదని మంత్రి జూపల్లిని ప్రశ్నించారు. మంత్రి స్వయంగా శంకుస్థాపన చేసిన పనులే ప్రారంభం కాకపోతే నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా సాధ్యమని నిలదీశారు.

దీనిపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందిస్తూ.. 2018 నుంచి 2023 మధ్య ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఎన్ని ఇళ్లు నిర్మించారో చెప్పాలని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. దీంతో ఇరువురి మధ్య మాటల తూటాలు పేలాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కల్యాణలక్ష్మి, రైతుబంధు తదితర పథకాలను సమర్థంగా అమలు చేశామని కోవ లక్ష్మి బదులిచ్చారు. మంత్రి వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.

అనంతరం జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. గత కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని రూ.8.25 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టిందని ఆరోపించారు. రాష్ట్ర ఖజానా నుంచి ప్రతి నెలా సుమారు రూ.6 వేల కోట్లు అప్పుల వడ్డీల చెల్లింపులకే వెచ్చించాల్సి వస్తోందన్నారు. ఆర్థిక పరిమితుల కారణంగానే కొన్ని అభివృద్ధి పనుల్లో జాప్యం జరుగుతోందని వివరించారు.

అయితే పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులన్నింటినీ దశలవారీగా పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రభుత్వ కార్యక్రమంలో మంత్రి, ఎమ్మెల్యే మధ్య చోటుచేసుకున్న ఈ వాగ్వాదం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version