Home తెలంగాణ మూసీకి మహర్దశ.. దసరా నుంచే తొలి దశ పనులు?

మూసీకి మహర్దశ.. దసరా నుంచే తొలి దశ పనులు?

0

హైదరాబాద్: మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుకు సంబంధించిన పనులు త్వరలోనే పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టులో తొలి దశ పనులకు దసరా రోజున శ్రీకారం చుట్టేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. దీంతో హైదరాబాద్ నగరంలో మూసీ అభివృద్ధి పనులపై మరోసారి ఆసక్తి నెలకొంది.

ఫేజ్-1 కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.7,345.12 కోట్లతో పరిపాలనా అనుమతులు జారీ చేసింది. ప్రాజెక్టు వ్యయంలో రూ.4,500 కోట్లను ADB రుణం ద్వారా సమీకరించనున్నారు. మరో రూ.2,845.12 కోట్లను HMDA, TGIIC ద్వారా సమకూర్చాలని నిర్ణయించారు.

ADB రుణం కోసం అవసరమైన ఫేజ్-1 DPRను ఇప్పటికే సమర్పించగా, రుణ మంజూరు ప్రక్రియ తుది దశలో ఉన్నట్లు సమాచారం. ఈ ప్రక్రియ పూర్తయితే దసరా నాటికి పనులకు శంకుస్థాపన చేసే దిశగా అధికారులు ముందుకు సాగుతున్నారు.

బాపూఘాట్ వరకు అభివృద్ధి

మూసీ పునరుజ్జీవన తొలి దశలో రెండు ప్రధాన మార్గాల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. హిమాయత్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 9.2 కిలోమీటర్లు, ఉస్మాన్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 11.8 కిలోమీటర్ల మేర పనులు జరగనున్నాయి.

ఈ రెండు మార్గాల్లో నది ప్రక్షాళన, సుందరీకరణ, మౌలిక వసతుల అభివృద్ధిని చేపట్టనున్నారు. నదిలో పేరుకుపోయిన పూడిక, వ్యర్థాలను తొలగించడంతో పాటు నీటి నిల్వకు అవసరమైన ఏర్పాట్లు చేయనున్నారు. భవిష్యత్‌లో బోటింగ్ వంటి సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావాలనే ప్రణాళిక కూడా ఉంది.

మురుగు నీటికి చెక్

మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో నదిలోకి మురుగు నీరు చేరకుండా చర్యలు తీసుకోవడం ప్రధాన అంశంగా ఉంది. ఇందుకోసం నదికి ఇరువైపులా భారీ ట్రంక్ లైన్లు, వర్షపు నీటి డ్రెయిన్లను ఏర్పాటు చేయనున్నారు.

అదే సమయంలో నది వెంట రోడ్లు, ల్యాండ్‌స్కేపింగ్, సైకిల్ ట్రాక్‌లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు వంటి సదుపాయాలను అభివృద్ధి చేయనున్నారు. ఫేజ్-1 పనులు ప్రారంభమైన తర్వాత హైదరాబాద్ గేట్‌వే నిర్మాణంపై దృష్టి పెట్టనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఇక నాగోలు–గౌరెల్లి ప్రాంతం వరకు ప్రతిపాదించిన ఫేజ్-2 పనుల DPR తయారీని కూడా ప్రభుత్వం వేగవంతం చేసింది. దీంతో దశలవారీగా మూసీ నది పునరుజ్జీవన పనులను ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version