Home తెలంగాణ మధు యాష్కీకి కాంగ్రెస్‌లో కీలక పదవి.. ఏఐపీసీ ఛైర్మన్‌గా నియామకం

మధు యాష్కీకి కాంగ్రెస్‌లో కీలక పదవి.. ఏఐపీసీ ఛైర్మన్‌గా నియామకం

0

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధు గౌడ్ యాష్కీకి జాతీయ స్థాయిలో కీలక బాధ్యత లభించింది. ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (AIPC) ఛైర్మన్‌గా ఆయనను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నియమించారు. ఈ నియామకానికి సంబంధించిన అధికారిక ప్రకటనను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ విడుదల చేశారు.

ఏఐపీసీ ఇప్పటివరకు ఛైర్మన్‌గా వ్యవహరించిన ప్రవీణ్ చక్రవర్తి సేవలను కాంగ్రెస్ అధిష్ఠానం ఈ సందర్భంగా అభినందించింది. ఆయన స్థానంలో మధు యాష్కీకి బాధ్యతలు అప్పగించింది.

వరుసగా రెండుసార్లు ఎంపీగా విజయం

మధు యాష్కీ రాజకీయ ప్రస్థానంలో నిజామాబాద్ లోక్‌సభ స్థానం కీలకంగా నిలిచింది. 2004, 2009 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు నిజామాబాద్ ఎంపీగా గెలిచారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఆయన మద్దతుగా నిలిచారు. పార్లమెంట్‌లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ చీఫ్ విప్‌గా కూడా పనిచేశారు.

అయితే 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో పరాజయం ఎదురైంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీ నగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ విజయం సాధించలేకపోయారు.

ప్రచార కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు

2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రచార కమిటీ బాధ్యతలను మధు యాష్కీకి అప్పగించింది. ఎన్నికల ప్రచారంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. ఎన్నికల ఫలితాల్లో ఓటమి ఎదురైనా పార్టీ జాతీయ నాయకత్వంతో ఆయనకు ఉన్న సన్నిహిత సంబంధాలు కొనసాగాయి.

రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీపీసీసీ అధ్యక్ష పదవికి మధు యాష్కీ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. చివరకు ఆ బాధ్యతలను మహేశ్ కుమార్ గౌడ్‌కు అప్పగించారు.

తాజాగా ఏఐపీసీ ఛైర్మన్‌గా యాష్కీ నియామకం కావడంతో ఆయనకు కాంగ్రెస్ అధిష్ఠానం మరోసారి కీలక బాధ్యత అప్పగించినట్లైంది. జాతీయ స్థాయిలో పార్టీ ప్రొఫెషనల్ విభాగాన్ని ఆయన ఎలా ముందుకు తీసుకెళ్తారన్నది ఆసక్తికరంగా మారింది.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version