నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన బీజేపీ నేత ధర్మేంద్ర ప్రధాన్ తొలిసారి పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ, ఎన్డీయే ఎంపీలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ‘ధర్మేంద్ర ప్రధాన్ జిందాబాద్’, ‘భారత్ మాతా కీ జై’ అంటూ నినాదాలు చేస్తూ ఆయనకు సంఘీభావం ప్రకటించారు.
పార్లమెంట్ ప్రాంగణంలోని మకార్ ద్వార్ వద్ద ప్రధాన్‌కు సంప్రదాయ టోపీని బహూకరించి లోపలికి తీసుకెళ్లారు. ఈ క్లిష్ట సమయంలో తమ నాయకుడికి పూర్తి మద్దతు ఉందని అధికార కూటమి సంకేతాలు పంపింది.
మరోవైపు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా ఆధ్వర్యంలో విపక్ష ఎంపీలు నిరసన చేపట్టారు. నీట్ ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై పోలీసుల చర్యలను ఖండిస్తూ ‘శిక్షా చోరీ’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. హోంమంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ నిరసనలో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, అఖిలేష్ యాదవ్ తదితర నేతలు పాల్గొన్నారు. విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.






