Home తెలంగాణ హర్మూజ్‌లో అమెరికాకు షాక్‌.. ఇరాన్‌ చేతికి అత్యాధునిక సబ్‌మెరైన్‌?

హర్మూజ్‌లో అమెరికాకు షాక్‌.. ఇరాన్‌ చేతికి అత్యాధునిక సబ్‌మెరైన్‌?

4
0

ఇరాన్‌-అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. హర్మూజ్‌ జలసంధి వద్ద అమెరికా నిఘా కోసం ఉపయోగిస్తున్న మానవరహిత సబ్‌మెరైన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఇరాన్‌ నేవీ ప్రకటించింది. అత్యంత ఆధునిక సాంకేతికతతో రూపొందించిన జలాంతర్గామిని క్లిష్టమైన నిఘా ఆపరేషన్‌లో చేజిక్కించుకున్నట్లు వెల్లడించింది.

‘ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌’ అధికారిక మీడియా సంస్థ ‘సెపాహ్‌ న్యూస్‌’ విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపింది. స్వాధీనం చేసుకున్న వాహనం ‘డైవ్‌-ఎల్‌డీ (Dive-LD)’ అని పేర్కొంది. ఇది నీటి అడుగున పనిచేసే అత్యాధునిక మానవరహిత జలాంతర్గామి అని తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా విడుదల చేసింది.

ఇదే సమయంలో హర్మూజ్‌ జలసంధిపై అమెరికాకు చెందిన ఎంక్యూ-9 రీపర్‌ డ్రోన్‌ను కూల్చివేసినట్లు ఇరాన్‌ పేర్కొంది.

అయితే ఇరాన్‌ ప్రకటనపై అమెరికా స్పందించింది. నీటి అడుగున పనిచేసే తమ డ్రోన్ ఒకటి పనిచేయడం ఆగిపోయిందని అమెరికా సైన్యం తెలిపింది. ప్రాంతీయ జలాలను పరిశీలించే సమయంలో ఈ సమస్య తలెత్తిందని పెంటగాన్‌ ప్రతినిధి చెప్పారు. అయితే ఇరాన్‌ స్వాధీనం చేసుకున్నది అదేనా? కాదా? అన్న విషయాన్ని మాత్రం అమెరికా స్పష్టం చేయలేదు. అది పాత మోడల్‌ అని, ఎలాంటి కీలక సమాచారం సేకరించలేదని, రహస్య సోనార్‌ లేదా రాడార్‌ పరికరాలు లేవని పేర్కొంది.

డైవ్‌-ఎల్‌డీ ఒక్కసారి స్థావరానికి తిరిగి రాకుండా 10 రోజుల వరకు పనిచేయగలదు. దాదాపు 6,000 మీటర్ల లోతు వరకు వెళ్లగలదు. ఒక్కో వాహనం ధర సుమారు రూ.21 కోట్లుగా ఉన్నట్లు అమెరికా రక్షణ రంగ మీడియా వెల్లడించింది.

మరోవైపు ఇరాన్‌పై అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్‌ నుంచి జరిగిన దాడులకు ప్రతిస్పందనగా ఐదు ముడిచమురు ట్యాంకర్లను ధ్వంసం చేసినట్లు అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ తెలిపింది. అలాగే ఇరాన్‌కు చెందిన 27 విమానయాన సంస్థలను ప్రత్యేక ఆంక్షల జాబితాలో చేర్చి ఒత్తిడి మరింత పెంచింది.

అమెరికా దాడులకు ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ తీవ్రంగా స్పందించారు. యుద్ధాన్ని ఇరాన్‌ కోరుకోవడం లేదని చెబుతూనే.. దాడులను ఎదుర్కొనేందుకు తమ ప్రతిఘటనను మరింత బలంగా కొనసాగిస్తామని ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here