అమరావతి: రాష్ట్రంలోని విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందని విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. సొంత భవనాలు లేని 37 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు శాశ్వత భవనాలు నిర్మించనున్నట్లు శాసనసభలో వెల్లడించారు. ఒక్కో కళాశాల నిర్మాణానికి సుమారు రూ.15 కోట్లు ఖర్చవుతుందని, దశలవారీగా అన్ని కళాశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు.
ఆళ్లగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు శాశ్వత భవనం లేదని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సభ దృష్టికి తీసుకురాగా.. మంత్రి స్పందించారు. ప్రస్తుతం కళాశాలలో 103 మంది విద్యార్థులు ఉన్నారని, భవన నిర్మాణానికి అవసరమైన భూమి అందుబాటులో ఉందని తెలిపారు. ప్రత్యేక పథకం కింద కొత్త భవనంతో పాటు ధ్వంసమైన ప్రహరీ గోడను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ల్యాబ్స్, కంప్యూటర్లు, బెంచీలు వంటి అవసరాలను ఎమ్మెల్యే కోటా నిధుల ద్వారా సమకూర్చుకోవాలని సూచించారు.
175 నియోజకవర్గాల్లో మోడల్ లైబ్రరీలు
రాష్ట్రంలోని గ్రంథాలయ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని లోకేశ్ తెలిపారు. మంగళగిరిలో రూ.కోటితో ఏర్పాటు చేసిన మోడల్ లైబ్రరీ మంచి ఫలితాలు ఇస్తోందని చెప్పారు. రాత్రి 8 గంటల తర్వాత కూడా సుమారు 300 మంది విద్యార్థులు అక్కడ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారని వివరించారు. ఇదే తరహాలో 175 నియోజకవర్గాల్లో మోడల్ లైబ్రరీలు ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ రూపొందించామని తెలిపారు.
గ్రంథాలయాలకు రావాల్సిన సెస్సు నిధులను తిరిగి అందేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, పూర్వ విద్యార్థులు సీఎస్ఆర్ నిధుల ద్వారా సహకరించాలని కోరారు.
అమరావతిలో అత్యాధునిక సెంట్రల్ లైబ్రరీ
అమరావతిలో గ్లోబల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్, తెలుగు కల్చరల్ సెంటర్‌తో అనుసంధానించి దేశంలోనే అత్యుత్తమ సెంట్రల్ లైబ్రరీ నిర్మించనున్నట్లు మంత్రి ప్రకటించారు. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ కేంద్రంగా ఒక జోనల్ లైబ్రరీని, రాయలసీమ కేంద్రంగా మరో అత్యాధునిక జోనల్ లైబ్రరీని ఏర్పాటు చేస్తామని తెలిపారు.
పుస్తక పఠనం పిల్లల్లో సృజనాత్మకతను పెంచుతుందని, స్మార్ట్‌ఫోన్లు, ఐప్యాడ్‌ల వినియోగాన్ని తగ్గించడంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని లోకేశ్ పేర్కొన్నారు.






