Home జాతీయం హర్మూజ్ జలసంధి దిగ్బంధం.. ఇరాన్‌ను చుట్టుముట్టిన అమెరికా

హర్మూజ్ జలసంధి దిగ్బంధం.. ఇరాన్‌ను చుట్టుముట్టిన అమెరికా

11
0

పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం మరింతగా ముదిరింది. ఇరాన్‌పై అమెరికా వరుసగా మూడో రాత్రి కూడా వైమానిక దాడులతో విరుచుకుపడింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యక్ష ఆదేశాలతో యూఎస్ సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) ఈ దాడులను కొనసాగిస్తోంది. అంతర్జాతీయ వాణిజ్య నౌకలకు ఇరాన్ నుంచి ముప్పును పూర్తిగా తొలగించే లక్ష్యంతో ఈ ఆపరేషన్ చేపట్టినట్లు అమెరికా ప్రకటించింది. ఇరాన్ తీరప్రాంత నిఘా వ్యవస్థలు, డ్రోన్ కేంద్రాలు, క్షిపణి మౌలిక సదుపాయాలే లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల కారణంగా దక్షిణ ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ పోర్ట్, కిష్, క్విష్మ్ దీవులు, బుషెహర్ ప్రావిన్స్‌లోని జామ్ నగరం భారీ పేలుళ్లతో దద్దరిల్లినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.

‘పికాక్స్ పర్వతాన్ని కూల్చేస్తాం’
ఈ సైనిక చర్య మరో రెండు మూడు వారాల పాటు కొనసాగవచ్చని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచనప్రాయంగా తెలిపారు. ఓ రేడియో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇరాన్‌కు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. జాగ్రోస్ పర్వత శ్రేణుల్లో అత్యంత పటిష్టమైన భద్రత నడుమ భూగర్భంలో నిర్మించిన ‘పికాక్స్ మౌంటైన్’ అణు స్థావరంపై దాడికి తమ సైన్యం సిద్ధంగా ఉందని ప్రకటించారు. “మేం పికాక్స్ మౌంటైన్‌ను కూల్చివేయబోతున్నాం. సిద్ధంగా ఉండమని ఇరాన్‌కు చెప్పండి. దీన్ని వాళ్లు ఆపలేరు” అంటూ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

హర్మూజ్ జలసంధి దిగ్బంధం
వ్యూహాత్మక హర్మూజ్ జలసంధిని అమెరికా తన పూర్తి నియంత్రణలోకి తీసుకుంది. ఇటీవల ఒమన్ తీరంలో ఓ నౌకపై ఇరాన్ దాడి చేయడంతో, ఆ జలసంధికి తామే రక్షణ కల్పిస్తామని ప్రకటించింది. ఇకపై హర్మూజ్ గుండా ఇరాన్ నౌకలు గానీ, ఇరాన్ వినియోగదారుల నౌకలు గానీ ప్రయాణించకుండా పూర్తి దిగ్బంధం విధిస్తున్నట్లు ట్రంప్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇతర దేశాల వాణిజ్య నౌకల భద్రత కోసం, ప్రయాణ రుసుము కింద అదనంగా 20 శాతం టోల్ వసూలు చేయనున్నట్లు తెలిపారు.
Strait of Hormuz blockade US surrounds Iran
ప్రతిఘటన.. ఆందోళన
ప్రపంచ ముడిచమురు రవాణాలో కీలకమైన హర్మూజ్ జలసంధి తమ సార్వభౌమత్వంలోనిదని, అమెరికా అక్రమ జోక్యాన్ని సహించబోమని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్‌జీసీ) స్పష్టం చేసింది. ఈ దాడులతో ఇరు దేశాల మధ్య కుదిరిన 60 రోజుల తాత్కాలిక శాంతి ఒప్పందం పూర్తిగా నీరుగారిపోయింది. ఈ పరిణామాలు పూర్తిస్థాయి యుద్ధానికి దారితీస్తే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, భద్రతపై వినాశకరమైన ప్రభావం పడుతుందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here