హైదరాబాద్:హైదరాబాద్ మెట్రో విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం మరింత వేగం పెంచుతోంది. మెట్రో రెండో దశ పనులను ముందుకు తీసుకెళ్లేందుకు హెచ్‌ఎంఆర్‌ఎల్ కీలక చర్యలు చేపట్టింది. ప్రతిపాదిత కారిడార్లకు జనరల్ కన్సల్టెంట్లను త్వరగా ఖరారు చేసి.. ప్రాజెక్టు అమలుకు అవసరమైన ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులు నిర్ణయించారు.
ఇందులో భాగంగా నిర్వహించిన ప్రీ-బిడ్ సమావేశానికి 12 సంస్థలు హాజరయ్యాయి. రెండో దశలో మొత్తం ఏడు కారిడార్లు, సుమారు 122.9 కిలోమీటర్ల మేర మెట్రో మార్గాలను ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.38,595 కోట్లుగా ఉంది.
నాలుగు మార్గాలకు తొలి ప్రాధాన్యం
మొదటి విడతలో నాలుగు కారిడార్లకు జనరల్ కన్సల్టెంట్లను నియమించేందుకు ప్రక్రియ చేపట్టారు.
నాగోల్–శంషాబాద్ ఎయిర్‌పోర్టు మార్గం 36.8 కి.మీ, రాయదుర్గ్–కోకాపేట 11.6 కి.మీ, ఎంజీబీఎస్–చాంద్రాయణగుట్ట 7.5 కి.మీ, ఎల్బీనగర్–హయత్‌నగర్ 7.1 కి.మీ మేర నిర్మించనున్నారు.
ఈ మార్గాలపై కన్సల్టెంట్ల నియామకం పూర్తయిన తర్వాత ప్రాజెక్టు తదుపరి దశ పనులను మరింత వేగంగా చేపట్టే అవకాశం ఉంది.
కన్సల్టెంట్ ఎంపికలో నాణ్యతకే పెద్ద పీట
జనరల్ కన్సల్టెంట్ల ఎంపికలో క్వాలిటీ కమ్ కాస్ట్ బేస్డ్ సెలెక్షన్ (QCBS) విధానాన్ని అమలు చేయనున్నారు. మొత్తం 100 మార్కులతో సంస్థల పనితీరును అంచనా వేయనున్నారు.
గతంలో చేపట్టిన ప్రాజెక్టుల నాణ్యత, ఉపయోగించిన నిర్మాణ సామగ్రి, పనులు పూర్తి చేసిన సమయం, వారంటీ వంటి అంశాలకు 70 మార్కులు కేటాయించారు. నిపుణుల అర్హతలు, సీవీలకు మరో 30 మార్కులు ఉంటాయి.
అవసరమైతే గతంలో ఆయా సంస్థలు చేపట్టిన ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో పరిశీలించి.. నాణ్యత, సామర్థ్యం, టెండర్ ధర తదితర అంశాల ఆధారంగా తుది ఎంపిక చేయనున్నారు.
కేంద్రం ఆమోదం కోసం ఎదురుచూపులు
మెట్రో రెండో దశకు సంబంధించిన డీపీఆర్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తోంది. కేంద్రం అనుమతి లభించిన వెంటనే ప్రాజెక్టును మరింత వేగంగా అమలు చేసేందుకు హెచ్‌ఎంఆర్‌ఎల్ సిద్ధమవుతోంది.
తొలి దశ స్వాధీనానికి రుణాల వేట
మరోవైపు ఎల్‌అండ్‌టీ నుంచి తొలి దశ మెట్రో ప్రాజెక్టును స్వాధీనం చేసుకునే ప్రక్రియలో భాగంగా అవసరమైన నిధుల సమీకరణపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందుకోసం ఎస్‌బీఐ క్యాప్స్‌ను కన్సల్టెన్సీగా నియమించింది.
దేశ, విదేశీ బ్యాంకులతో సంప్రదింపులు జరిపి రుణాలు సమీకరించే బాధ్యతను ఎస్‌బీఐ క్యాప్స్‌కు అప్పగించారు. రుణాలపై వడ్డీ రేటు 3 నుంచి 4 శాతం లోపు ఉండేలా చూడాలని ప్రభుత్వం సూచించింది. ఈ ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
మెట్రో రెండో దశకు కేంద్రం అనుమతి, కన్సల్టెంట్ల ఎంపిక, నిధుల సమీకరణ పూర్తయితే హైదరాబాద్ మెట్రో నెట్‌వర్క్ మరింత విస్తరించే అవకాశం ఉంది.
