వికారాబాద్: 22ఏ నిషేధిత జాబితా అంశం వికారాబాద్ జిల్లాలో భూ యజమానులకు కొత్త సమస్యలను తెచ్చిపెట్టిందని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్లాట్లు, ఇండ్లు, వ్యవసాయేతర భూములు కూడా నిషేధిత జాబితాలో చేరడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయని వారు వాపోతున్నారు. భూ భారతి చట్టంతో సమస్యలు పరిష్కారమవుతాయని భావించినా.. పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారిందని ఆరోపిస్తున్నారు.
కొన్నేళ్ల క్రితం వ్యవసాయ భూములను కొనుగోలు చేసి, ప్రభుత్వానికి రుసుములు చెల్లించి నాలా కన్వర్షన్ చేయించుకున్నామని బాధితులు చెబుతున్నారు. అనంతరం డీటీసీపీ లేఅవుట్లు ఏర్పాటు చేసి ప్లాట్లు విక్రయించినా.. ప్రస్తుతం ఆయా భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడంతో తమ పరిస్థితి అయోమయంగా మారిందని పేర్కొంటున్నారు.
తాండూర్, పరిగిలోనూ సమస్య
వికారాబాద్ జిల్లాలోని తాండూర్‌లో సుమారు 77 ఎకరాల వ్యవసాయేతర భూములు, పరిగిలో సుమారు 100 ఇళ్లను నిషేధిత జాబితాలో చేర్చినట్లు బాధితులు చెబుతున్నారు. దీంతో తమ ప్లాట్లు, లేఅవుట్లను 22ఏ జాబితా నుంచి తొలగించాలని కోరుతూ కలెక్టర్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఆశ్రయిస్తున్నారు.
మరోవైపు, రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో ప్లాట్లు విక్రయించలేక, కొనుగోలు చేసిన ఆస్తులను బదలాయించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బాధితులు చెబుతున్నారు.
మొత్తం సర్వే నంబర్ నిషేధిత జాబితాలోకి?
ఒకే సర్వే నంబర్‌లో కొంత భూమి వ్యవసాయేతర భూమిగా కన్వర్షన్ అయి లేఅవుట్‌గా ఉండటంతో పాటు మరికొంత వ్యవసాయ భూమి ఉన్న సందర్భాల్లో.. సంబంధిత సబ్‌డివిజన్ నంబర్లను మాత్రమే నిషేధిత జాబితాలో చేర్చాల్సి ఉండగా, మొత్తం సర్వే నంబర్‌ను జాబితాలో చేర్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దీంతో చట్టబద్ధంగా కొనుగోలు చేసిన ప్లాట్ల యజమానులు కూడా ఇబ్బందులు పడుతున్నారని బాధితులు అంటున్నారు. ఈ అంశంపై అధికారులు స్పష్టత ఇవ్వాలని, అర్హత ఉన్న ప్లాట్లు, లేఅవుట్లను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.






