ఎన్డీయే ప్రభుత్వ హయాంలో పేద, మధ్యతరగతి ప్రజలకు మళ్లీ కట్టెల పొయ్యే దిక్కయ్యేలా కనిపిస్తున్నది. పశ్చిమాసియా ఉద్రిక్తతల పేరిట ఇప్పటికే వంటగ్యాస్ సిలిండర్ల ధరలను దఫాలుగా పెంచుతున్న కేంద్రం.. ఇప్పుడు ఉజ్వల యోజన కింద పేదింటి మహిళలకు ఇచ్చే సిలిండర్ల సంఖ్యలోనూ భారీగా కోత విధించింది. ఈ విషయాన్ని ఆయిల్ కంపెనీలు వెల్లడించాయి.గృహ అవసరాలకు వినియోగించే 14.2 కిలోల సిలిండర్ ధర ప్రస్తుతం హైదరాబాద్‌లో రూ. 994గా ఉన్నది. అయితే, పేదింటి మహిళలపై ఆర్థిక భారం తగ్గించడంలో భాగంగా ప్రభుత్వం ఉజ్వల యోజన కింద ఒక్కో సిలిండర్‌పై రూ. 300 మేర సబ్సిడీ అందిస్తున్నది. దీంతో ఉజ్వల స్కీమ్‌లోని మహిళలకు ఒక్కో సిలిండర్ రూ. 694కే లభిస్తున్నది. అయితే, ఈ స్కీమ్ కింద ఇప్పటివరకూ ఏడాదికి 9 సిలిండర్ల వరకూ తీసుకొనే వెసులుబాటు ఉండేది. అయితే, తాజా కోతలను అనుసరించి ఏడాదిలో 4 సిలిండర్లకు మాత్రమే ఈ సబ్సిడీ వర్తిస్తుందని కేంద్రప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఐదో సిలిండర్ కావాలంటే మొత్తం ధర అంటే రూ. 994 చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశాయి.ఉజ్వల స్కీమ్‌లో భాగంగా గతంలో ఏడాదికి 9 సిలిండర్లకు రూ. 300 చొప్పున సబ్సిడీ వర్తించేది. దీంతో ఒక్కో సిలిండర్‌కు రూ. 694 మాత్రమే చెల్లించేవారు. అలా ఏడాదికి ఒక్కో పేద కుటుంబానికి రూ. 2,700 మేర ఆదా అయ్యేది. అయితే, తాజాగా సబ్సిడీ లిమిట్‌ను 4 సిలిండర్లకే పరిమితం చేయడంతో మిగతా ఐదు సిలిండర్లకు పూర్తి మొత్తం అంటే రూ. 994 చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఉజ్వల స్కీమ్ పరిధిలోకి వచ్చే ఒక్కో కుటుంబం ఏడాదికి రూ. 1,500 మేర అదనంగా చెల్లించాల్సి వస్తున్నదని పలువురు వాపోతున్నారు. రాయితీకి కత్తెరేసిన కేంద్రం చర్యలతో పేదోడి బడ్జెట్ తలకిందులయ్యిందని విమర్శిస్తున్నారు.





