హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో మరో భారీ పరిణామం చోటుచేసుకోబోతోంది. ఇటీవల రాయదుర్గంలో జరిగిన ప్రభుత్వ భూముల వేలంలో ఎకరాకు రూ.204 కోట్ల రికార్డు ధర నమోదవడంతో ఉత్సాహంలో ఉన్న ప్రభుత్వం, ఇప్పుడు మరో మెగా ఈ-వేలాన్ని నిర్వహించేందుకు సిద్ధమైంది. నగరంలోని ప్రీమియం ప్రాంతాలతో పాటు వేగంగా అభివృద్ధి చెందుతున్న శివారు ప్రాంతాల్లోని భూములను మార్కెట్‌లోకి తీసుకురానుంది.
ఈ వేలంలో ప్రధాన ఆకర్షణగా బంజారాహిల్స్‌లోని 8.24 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమి నిలిచింది. హెచ్‌ఎండీఏ చరిత్రలో తొలిసారిగా ఈ ప్రాంతంలోని ప్రభుత్వ భూమిని బహిరంగ ఈ-వేలానికి తీసుకురావడం విశేషం. ఈ భూమికి ఎకరాకు రూ.99 కోట్ల కనీస ధరను నిర్ణయించారు. నగర నడిబొడ్డున ఉన్న ఈ ప్రైమ్ లొకేషన్‌పై రియల్ ఎస్టేట్, కార్పొరేట్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
మొత్తం 176 ప్లాట్లను ఈ-వేలం కోసం గుర్తించారు. మోకిలాలో 100 ప్లాట్లు, మేడిపల్లిలో 68 ప్లాట్లు ఉండగా, నార్సింగి, చందానగర్, పీర్జాదిగూడ, బైరాగిగూడ, బౌరంపేట ప్రాంతాల్లోని నివాస, వాణిజ్య స్థలాలను కూడా వేలంలో ఉంచనున్నారు.
బంజారాహిల్స్ భూమి ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు సమీపంలో ఉండటంతో పాటు పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మెరుగైన అనుసంధానం కలిగి ఉంది. అదనంగా కార్పొరేట్ ఆసుపత్రులు, స్టార్ హోటళ్లు, ప్రముఖ విద్యాసంస్థలు, కేబీఆర్ పార్క్ వంటి కీలక కేంద్రాలు సమీపంలో ఉండటం ఈ భూమి విలువను మరింత పెంచుతోంది.
ప్రాంతాల వారీగా అప్‌సెట్ ధరలను కూడా ఖరారు చేశారు. మోకిలాలో గజానికి రూ.50 వేల నుంచి, చందానగర్-సూరారం ప్రాంతాల్లో రూ.60 వేల నుంచి, నార్సింగిలో రూ.50 వేల నుంచి, మేడిపల్లిలో రూ.45 వేల నుంచి, పీర్జాదిగూడ-బైరాగిగూడల్లో రూ.40 వేల నుంచి, బౌరంపేటలో రూ.30 వేల నుంచి వేలం ప్రారంభం కానుంది.
జూన్ 17 నుంచి 30 వరకు దశలవారీగా ఈ-వేలం నిర్వహించనుండగా, బంజారాహిల్స్ భూమికి జూన్ 19న వేలం జరగనుంది. ఈ మెగా ఆక్షన్‌పై రియల్ ఎస్టేట్, కార్పొరేట్ రంగాలు ప్రత్యేక దృష్టి సారించాయి.
ఈ వేలం ద్వారా రాష్ట్ర ఖజానాకు వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరే అవకాశం ఉండటంతో పాటు, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు మరో కీలక మైలురాయిగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్లోబల్ ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తూ, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సత్తాను మరోసారి ప్రపంచానికి చాటిచెప్పే వేదికగా ఈ మెగా ఈ-వేలం మారనుంది.






