వర్షాల ప్రభావంతో ముంబైలోని ఓ మెట్రో స్టేషన్‌లో అత్యంత విషపూరితమైన రక్త పింజరి పాము ప్రత్యక్షమై ప్రయాణికులను భయాందోళనకు గురిచేసింది.
ఈ ఘటన బాంద్రా-కుర్లా మెట్రో లైన్-3 స్టేషన్‌లో సోమవారం ఉదయం చోటుచేసుకుంది.
సమాచారం ప్రకారం.. ఉదయం సుమారు 7:30 గంటల సమయంలో మెట్రో స్టేషన్ బేస్‌మెంట్‌లోకి రక్త పింజరి పాము ప్రవేశించింది. ఫ్లోర్‌పై అటూ ఇటూ సంచరిస్తున్న పామును గమనించిన ప్రయాణికులు ఒక్కసారిగా భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. దీంతో కొంతసేపు స్టేషన్‌లో ఆందోళనకర వాతావరణం నెలకొంది.
వెంటనే అప్రమత్తమైన మెట్రో సిబ్బంది స్నేక్ రెస్క్యూ బృందానికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి, నీళ్ల బాటిల్ సహాయంతో పామును సురక్షితంగా పట్టుకుని అక్కడి నుంచి తరలించారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు వర్షాకాలంలో పాములు నివాస ప్రాంతాల్లోకి, ప్రజా రవాణా కేంద్రాల్లోకి రావడం సాధారణమేనని పేర్కొంటూ స్పందిస్తున్నారు. “వర్షాలు మొదలైతే పాములు ఎక్కడికైనా చేరుతాయి”, “వర్షాకాలంలో మరింత అప్రమత్తంగా ఉండాలి” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
వర్షాల కారణంగా పాములు తమ బిలాల నుంచి బయటకు వచ్చి పొడి ప్రాంతాలను ఆశ్రయించే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.






