హైదరాబాద్: అర్ధరాత్రి అత్యవసర పరిస్థితిలో ఆస్పత్రికి వచ్చిన ఓ తల్లికి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అండగా నిలిచిన ఘటన మానవత్వానికి నిదర్శనంగా నిలిచింది. నాలుగు నెలల చంటి బిడ్డకు ఫిట్స్ రావడంతో తీవ్ర ఆందోళనకు గురైన ప్రవళిక అనే మహిళ రాత్రి ఒంటి గంట సమయంలో ఆటోలో ఆస్పత్రికి చేరుకుంది.
అదే సమయంలో ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీ నిర్వహిస్తున్న జగ్గారెడ్డి, మహిళల వార్డు వద్ద చేతుల్లో చంటిపాపను ఎత్తుకుని ఆందోళనగా నిల్చున్న ప్రవళికను గమనించారు. ఆమెను పలకరించి పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.
ప్రవళిక తన నాలుగు నెలల బిడ్డకు అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చాయని, చిన్నారిలో చలనం లేకపోవడంతో భయాందోళనకు గురై ఒంటరిగానే ఆస్పత్రికి వచ్చానని జగ్గారెడ్డికి వివరించింది. పరిస్థితి తీవ్రతను గుర్తించిన ఆయన వెంటనే స్పందించారు.
ఆలస్యం చేయకుండా తల్లీబిడ్డలను తన కారులో ఎక్కించుకుని మాతా శిశు ఆస్పత్రి (ఎంసీహెచ్)కు స్వయంగా తీసుకెళ్లారు. అక్కడ విధుల్లో ఉన్న వైద్యులతో మాట్లాడి చిన్నారికి వెంటనే అత్యవసర చికిత్స ప్రారంభించేలా చర్యలు తీసుకున్నారు.
ఈ ఘటనతో ఆస్పత్రిలో ఉన్న రోగులు, వారి బంధువులు జగ్గారెడ్డి తీరును అభినందించారు. అత్యవసర పరిస్థితిలో ప్రజాప్రతినిధి స్వయంగా స్పందించి తల్లీబిడ్డలకు అండగా నిలవడం ప్రశంసనీయమని పలువురు పేర్కొన్నారు.
జగ్గారెడ్డి చూపిన ఈ మానవతా స్పందన ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అత్యవసర సమయంలో వేగంగా స్పందించి చిన్నారి చికిత్సకు సహకరించడం పట్ల పలువురు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు.






