తెలంగాణలోని పేదలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన–అర్బన్ (PMAY-U) 2.0 పథకం కింద రాష్ట్రానికి అదనంగా 8,338 ఇళ్లను మంజూరు చేసింది. ఈ ఇళ్ల నిర్మాణానికి కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ ఆమోదం తెలిపింది.
కొత్తగా మంజూరైన ఇళ్ల కోసం కేంద్రం రూ.125.07 కోట్ల నిధులను ప్రకటించింది. ఇందులో తొలి విడతగా రూ.50 కోట్లను విడుదల చేసింది. ఢిల్లీలో జరిగిన సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ ఉన్నతస్థాయి సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనలు, సమగ్ర నివేదికలను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.
పీఎం ఆవాస్ యోజన పథకం కింద ఇళ్ల కోసం తెలంగాణలో వేలాది మంది పేదలు దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్నారు. తాజాగా కేంద్రం అదనపు ఇళ్లను మంజూరు చేయడంతో అర్హులైన లబ్ధిదారుల్లో ఆశలు పెరిగాయి. ఈ పథకం కింద ఒక్కో లబ్ధిదారుడికి కేంద్రం నుంచి గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు ఆర్థిక సహాయం అందే అవకాశం ఉంది.
అయితే, ఇప్పటికే కేటాయించిన నిధుల వినియోగంపై కేంద్రం తెలంగాణ ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. గతంలో రాష్ట్రానికి రూ.173.58 కోట్లను కేటాయించగా, అందులో కేవలం రూ.63 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన రూ.112 కోట్లలో ఇప్పటివరకు రూ.54.79 కోట్లు మాత్రమే వినియోగించినట్లు పేర్కొంది.
మొత్తం 28,930 మంది లబ్ధిదారులకు కేంద్రం నిధులు మంజూరు చేయగా, రాష్ట్ర ప్రభుత్వం కేవలం 14,343 మందికే నిధులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. మిగిలిన లబ్ధిదారులకు కూడా వెంటనే నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిధులను పెండింగ్‌లో ఉంచడంపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
పీఎం ఆవాస్ యోజన తొలి దశలో మంజూరైన ఇళ్ల నిర్మాణాలను సెప్టెంబర్ 30లోపు పూర్తి చేయాలని కేంద్రం గడువు విధించింది. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేస్తేనే కేంద్రం నుంచి సబ్సిడీలు, ఇతర రాయితీలు అందుతాయని స్పష్టం చేసింది. గడువు దాటితే ఎలాంటి అదనపు సబ్సిడీలు ఉండవని తేల్చిచెప్పింది.
సొంత స్థలంలో ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారులు 12 నుంచి 18 నెలల వ్యవధిలో నిర్మాణాలను పూర్తి చేయాలని సూచించింది. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలోపు విద్యుత్, రహదారులు, తాగునీరు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వానిదేనని కేంద్రం పేర్కొంది. మౌలిక వసతులు ఏర్పాటు చేసిన తర్వాతే మూడో విడత నిధులను క్లెయిమ్ చేసుకోవాలని సూచించింది.
అఫర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్ట్ కింద ఇప్పటివరకు 1,36,125 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని కేంద్రం తెలిపింది. అయితే, వాటిలో కేవలం 92,241 ఇళ్లలోనే లబ్ధిదారులు నివాసం ఉంటున్నారని పేర్కొంది.





