తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG TET-2026) పరీక్షలు విజయవంతంగా ముగిశాయి. జూన్ 14 నుంచి 22 వరకు మొత్తం 10 సెషన్లలో నిర్వహించిన ఈ పరీక్షలు సోమవారంతో పూర్తయ్యాయి. టెట్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది అభ్యర్థులకు విద్యాశాఖ కీలక సమాచారం వెల్లడించింది.
రాష్ట్రవ్యాప్తంగా టెట్‌కు మొత్తం 1,53,752 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 1,15,028 మంది పరీక్షలకు హాజరయ్యారు. మొత్తం హాజరు శాతం 74.81గా నమోదైంది. మరో 38,724 మంది అభ్యర్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారు.
జూన్ 30న ప్రాథమిక ఆన్సర్ కీ
టెట్ పరీక్షలు ముగియడంతో ప్రాథమిక ఆన్సర్ కీ విడుదలకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం జూన్ 30న ప్రిలిమినరీ కీని విడుదల చేయనున్నారు.
ఆన్సర్ కీలో ఏవైనా తప్పులు ఉన్నాయని భావించే అభ్యర్థులు జూలై 2వ తేదీ వరకు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ అభ్యంతరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. అభ్యంతరాలకు సంబంధించిన ఆధారాలను కూడా సమర్పించాల్సి ఉంటుంది.
జూలై చివరి వారంలో ఫలితాలు
అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం తుది ఆన్సర్ కీని విడుదల చేసి, జూలై 28 నుంచి 31వ తేదీల మధ్య టెట్ ఫలితాలను ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు.
దీంతో టెట్ అభ్యర్థులు మరో నెల రోజుల్లో తమ ఫలితాలను తెలుసుకునే అవకాశం ఉంది.
ప్రభుత్వ పాఠశాలల్లో 14,171 టీచర్ పోస్టులు ఖాళీ
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో భారీ సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 14,171 టీచర్ పోస్టులు భర్తీ కావాల్సి ఉంది.
వాటిలో:
- 13,061 పోస్టులు ప్రాథమిక పాఠశాలల్లో
- 1,110 పోస్టులు ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్నాయి.
తెలంగాణలో దాదాపు 27 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, మొత్తం 1,26,820 టీచర్ పోస్టులు మంజూరయ్యాయి. ప్రస్తుతం 1,13,057 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు.
టీచర్ల పదవీ విరమణలు పెరుగుతున్న నేపథ్యంలో ఖాళీల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. దీంతో టెట్ పూర్తైన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి ఖాళీలను భర్తీ చేయాలని నిరుద్యోగ అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.






