Home తెలంగాణ రాత్రి వేళల్లో ప్రభుత్వ భూముల్లో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు..! అధికారులు ఎందుకు మౌనం..?

రాత్రి వేళల్లో ప్రభుత్వ భూముల్లో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు..! అధికారులు ఎందుకు మౌనం..?

18
0
  • రాత్రి వేళల్లో జరుగుతున్న మట్టి తవ్వకాలు అధికారులకు కనిపించడం లేదా?
  • ప్రభుత్వ భూములను కాపాడాల్సిన యంత్రాంగం ఎందుకు స్పందించడం లేదు?
  • అక్రమ తవ్వకాల వెనుక ఎవరి అండ ఉంది?
  • ఉన్నతాధికారులు విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటారా?

TGN NEWS (మేడ్చల్): మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలో పగలంతా ప్రశాంతంగా కనిపించే రావల్ కోల్ గ్రామ శివారులోని గద్వాల్ చెరువు పరిసరాలు రాత్రి వేళల్లో అక్రమ మట్టి తవ్వకాలతో కిటకిటలాడుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చీకటి పడగానే హిటాచీలు, టిప్పర్లతో చెరువులో నుంచి మట్టిని తవ్వి తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గత ఐదు రోజులుగా ఈ తవ్వకాలు నిరంతరంగా కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు స్పందించడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాత్రి వేళల్లోనే మట్టి తరలింపు:

స్థానికుల కథనం ప్రకారం, రాత్రి ప్రారంభమైన వెంటనే హిటాచీల సహాయంతో చెరువులో నుంచి భారీగా మట్టిని తవ్వి టిప్పర్లలో లోడ్ చేసి వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. మేడ్చల్, దుండిగల్, సుచిత్ర, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, బహదూర్‌పల్లి ప్రాంతాలకు ఈ మట్టిని సరఫరా చేస్తున్నట్లు సమాచారం. ఒక్కో టిప్పర్‌కు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తూ ఈ అక్రమ వ్యాపారం సాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

చెరువు మనుగడపై ఆందోళన:
చెరువులో నుంచి విచ్చలవిడిగా మట్టిని తవ్వడం వల్ల చెరువు సహజ స్వరూపం దెబ్బతినడంతో పాటు భవిష్యత్తులో చెరువు మనుగడకే ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అక్రమ తవ్వకాల కారణంగా ఇప్పటికే అనేక చెరువులు కనుమరుగయ్యాయని, ఇప్పుడు గద్వాల్ చెరువు కూడా అదే పరిస్థితిని ఎదుర్కొనే ప్రమాదం ఉందని వారు చెబుతున్నారు.

అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు:
అనుమతులు లేకుండా చెరువుల నుంచి మట్టిని తవ్వడం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమైనప్పటికీ, అక్రమంగా మట్టి తరలింపు యథేచ్ఛగా కొనసాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని అడ్డుకోవాల్సిన సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని, అక్రమార్కులకు పరోక్షంగా సహకారం అందుతోందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

సమగ్ర విచారణకు డిమాండ్:
రావల్ కోల్ శివారులోని గద్వాల్ చెరువులో జరుగుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమ మట్టి తవ్వకాలపై సమగ్ర విచారణ జరిపించాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అనుమతులు లేకుండా ప్రభుత్వ భూములు, చెరువుల నుంచి మట్టిని తరలిస్తున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పర్యావరణాన్ని కాపాడేందుకు, చెరువుల పరిరక్షణకు అధికారులు వెంటనే స్పందించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here