హైదరాబాద్‌లోని సైదాబాద్‌లో ఓ ప్రైవేట్ పాఠశాలలో రెండో తరగతి విద్యార్థికి హోంవర్క్ పేరుతో మతపరమైన పాఠాలు రాయించాలని, చదవాలని చెప్పినట్లు వచ్చిన ఆరోపణలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ ఘటనపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అందిన సమాచారం ప్రకారం, క్లాస్-2లో చదువుతున్న ఓ హిందూ విద్యార్థికి హోంవర్క్‌లో భాగంగా కల్మా, సూరా అల్ ఫాతిహా రాయాలని, చదవాలని సూచించినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై విద్యార్థి కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన కిషన్ రెడ్డి, చిన్నారులపై ఎలాంటి మతపరమైన ప్రభావం చూపే ప్రయత్నాలైనా ఆందోళనకరమని పేర్కొన్నారు. అమాయక పిల్లల మనసుల్లో మతపరమైన భావజాలాన్ని రుద్దే ప్రయత్నాలు ఆమోదయోగ్యం కావని అన్నారు.
అదే సమయంలో ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ, పోలీసు అధికారులు వెంటనే దృష్టి సారించి పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ఆయన కోరారు. ఘటనలో తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటన నేపథ్యంలో పాఠశాల యాజమాన్యం స్పందన కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. అధికారుల విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.






