బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వర్షాలు కురిసే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD), ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వర్ష హెచ్చరికలు జారీ చేశాయి. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఉత్తర ఒడిశా–పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలకు ఆనుకుని బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణం పూర్తిగా మారనుంది. కోస్తాంధ్ర, తెలంగాణ మీదుగా మహారాష్ట్ర వరకు ద్రోణి విస్తరించి ఉండటంతో పలు ప్రాంతాల్లో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఏపీలో ఈ జిల్లాలకు వర్ష సూచన
శుక్రవారం ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ముఖ్యంగా ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలోని అనంతపురం జిల్లాలోనూ అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశముందని పేర్కొన్నారు. మిగిలిన జిల్లాల్లో కూడా స్థానికంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
పిడుగులు, ఈదురుగాలుల హెచ్చరిక
వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఉరుములు, పిడుగులు సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్స్ సమీపంలో నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తెగిపోయిన విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలని కూడా హెచ్చరించింది.
తెలంగాణలోనూ రెయిన్ అలర్ట్
తెలంగాణలోనూ అల్పపీడనం ప్రభావం కనిపించనుంది. గురువారం సాయంత్రం పలు జిల్లాల్లో వర్షాలు కురవగా, శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో జల్లులు పడ్డాయి. గత కొద్ది రోజులుగా తీవ్ర ఎండలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వర్షాలు కొంత ఊరటనివ్వనున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇప్పటికే నమోదైన వర్షపాతం
గురువారం శ్రీకాకుళం జిల్లాలోని సోంపేటలో 2.4 సెంటీమీటర్లు, మందసలో 1.8 సెంటీమీటర్లు, పలాసలో 1.6 సెంటీమీటర్లు, పాతపట్నంలో 1.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నంద్యాల, పార్వతీపురం జిల్లాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు కురిశాయి.
అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని, వర్షాల సమయంలో అవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.






